హ్యాట్సాఫ్‌ బంగ్లాదేశ్‌: షోయబ్‌ అక్తర్‌

Hats off to Bangladesh for their Performance Akhtar - Sakshi

కరాచీ: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలై, మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టును పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసించాడు. ప్రధానంగా మూడో టీ20లో అద్వితీయ ప్రదర్శనను కనబరచడంతో టీమిండియాను బాస్‌ ఆఫ్‌ ద గేమ్‌ అంటూ కొనియాడాడు. ‘ టీమిండియా సమిష్ట ప్రదర్శనతో సిరీస్‌ను గెలుచుకుంది. మూడో మ్యాచ్‌లో సత్తాచాటి బాస్‌ ఆఫ్‌ ద గేమ్‌గా నిరూపించుకుంది. రెండో టీ20లో భారత్‌ గెలవడానికి రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ కారణం. రోహిత్‌లో అసాధారణ బ్యాటింగ్‌ టాలెంట్‌ ఉంది.

అతను పరుగులు చేయాలని ఏ సందర్భంలో అనుకున్నా సాధిస్తాడు. చివరి టీ20 ఆసక్తికరంగా ఉంటుందనుకున్నా. కానీ భారత్‌ ఒక్కసారిగా విజృంభించడంతో హోరాహోరీ మ్యాచ్‌ కాస్తా ఏకపక్షంగా మారిపోయింది. ఇక్కడ బంగ్లాదేశ్‌ ఆటను తక్కువ చేయలేం. బంగ్లాదేశ్‌ సిరీస్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. భారత్‌కు కచ్చితంగా గట్టిపోటీ ఇచ్చింది. హ్యాట్సాఫ్‌ బంగ్లాదేశ్‌. బంగ్లా పసికూన కాదనే విషయం మరోసారి రుజువైంది. బంగ్లా పులులు ఏ జట్టుముందైనా అంత తేలిగ్గా తలవంచరు. ప్రతీ జట్టుకు గట్టిపోటీ ఇస్తూ బంగ్లాదేశ్‌ పటిష్టమైన జట్టుగా ఎదిగింది’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. ఇక దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌పై కూడా అక్తర్‌ ప్రశంసలు కురింపిచాడు. అటు మీడియం పేస్‌ను, ఇటు సీమ్‌ను మిక్స్‌ చేసి చాహర్‌ మంచి ఫలితాన్ని రాబట్టాడని అన్నాడు. హ్యాట్రిక్‌తో పాటు ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించడానికి స్లో పేస్‌తో బంతిని స్వింగ్‌ చేయడమే కారణమన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top