క్లీన్‌స్వీప్‌ ఇక ఖాయమే!

క్లీన్‌స్వీప్‌ ఇక ఖాయమే!


మూడో టెస్టులోనూ భారత్‌ జోరు

హార్దిక్‌ పాండ్యా మెరుపు సెంచరీ

శ్రీలంకకు ఫాలోఆన్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 487  




సిరీస్‌లో తొలిసారి మెరుగ్గా ఆడుతున్నట్టు కనిపించిన శ్రీలంక రెండో రోజే చేతులెత్తేసింది. టి20 తరహాలో చెలరేగిన హార్దిక్‌ పాండ్యా  వీరోచిత సెంచరీతో భారత్‌కు భారీ స్కోరును అందించగా... ‘చైనామన్‌’ కుల్దీప్‌ యాదవ్‌ (4/40) స్పిన్‌ మ్యాజిక్‌తో లంకనుచుట్టేశాడు.ప్రస్తుతం మరో 333 పరుగులు వెనకబడిన దశలో లంక పోరాడుతుందా? లేక మూడో రోజే వైట్‌వాష్‌కు గురవుతుందా? అనేది వేచి చూడాలి.



పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ఇక లాంఛనమే అనుకోవాలి. కెరీర్‌లో మూడో టెస్టు ఆడుతున్న యువ బ్యాట్స్‌మన్‌ హార్దిక్‌ పాండ్యా (96 బంతుల్లో 108; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) లంక స్పిన్నర్లపై విరుచుకుపడి తన తొలి శతకాన్ని అందుకున్నాడు. దీంతో భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 122.3 ఓవర్లలో 487 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 37.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్‌కు 352 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఈ దశలో ఫాలోఆన్‌ కోసం బరిలోకి దిగిన లంక ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 19 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... లంక ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకునేందుకు మరో 333 పరుగులు చేయాల్సి ఉంది.ఆకాశమే హద్దుగా: రెండో రోజు భారత్‌ ఆటలో హార్దిక్‌ పాండ్యా టెయిలెండర్లను అండగా చేసుకుని వీరవిహారం  చేశాడు.



లంచ్‌ సెషన్‌లోపే సెంచరీ చేశాడు. 329/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌ సాహా (16) రూపంలో త్వరగానే వికెట్‌ కోల్పోయింది. అయితే  కుల్దీప్‌తో(26; 2 ఫోర్లు)  కలిసి పాండ్యా ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జత చేశాడు. తన తొలి అర్ధ సెంచరీని 61 బంతు ల్లో చేసిన పాండ్యా... ఆ తర్వాత 25 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి తొలి సెంచరీని అందుకున్నాడు. పుష్ప కుమార వేసిన ఇన్నింగ్స్‌ 116వ ఓవర్లో పాండ్యా వరుసగా 2 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టి 26 పరుగులు సాధించాడు. దీంతో భారత్‌ తరఫున టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. చివర్లో ఉమేశ్‌తో కలిసి 26 బంతుల్లోనే 50 పరుగులు జత చేసిన పాండ్యా... సందకన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.  



టప టపా వికెట్లు: తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. చండిమాల్‌ (48; 6 ఫోర్లు), డిక్‌వెలా (29; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు.ఓపెనర్లను షమీ పెవిలియన్‌కు చేర్చగా... కుల్దీప్, అశ్విన్‌ స్పిన్‌ ఉచ్చులో మిగతా వారు విలవిల్లాడారు.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top