చాపెల్‌కు చేత కాలేదు!

Greg Chappell did not know how to run an international team - Sakshi

అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా పనికి రాడన్న లక్ష్మణ్‌  

న్యూఢిల్లీ: గ్రెగ్‌ చాపెల్‌ భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఉన్న కాలంలో సీనియర్‌ ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాల గురించి క్రికెట్‌ ప్రపంచం మొత్తానికి తెలుసు. సచిన్, గంగూలీ తదితరులు తాము ఆ సమయంలో ఎలా ఇబ్బంది పడ్డామో గతంలోనే చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్‌ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తన ఆటోబయోగ్రఫీ ‘281 అండ్‌ బియాండ్‌’లో అతను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

ఒక అగ్రశ్రేణి జట్టుకు కోచ్‌గా ఎలా వ్యవహరించాలో చాపెల్‌కు తెలీదని లక్ష్మణ్‌ విమర్శించాడు. ‘అతని పదవీకాలం మొత్తం ఒక చేదు జ్ఞాపకం. ఒక అంతర్జాతీయ క్రికెట్‌ జట్టును ఎలా నడిపించాలో అతనికి తెలియదు. మైదానంలో ఆడాల్సింది క్రికెటర్లు మాత్రమేనని కోచ్‌ కాదనే విషయాన్ని అతను మరచిపోయినట్లు అనిపించేది. చాలా మంది మద్దతుతో భారత జట్టుకు కోచ్‌గా వచ్చిన అతను జట్టును ఇబ్బందుల్లో నెట్టేసి వెళ్లిపోయాడు. నా కెరీర్‌లో ఘోరంగా విఫలమైన దశలో అతని పాత్ర కూడా ఉంది.

అతని ఆలోచనలు సఫలమయ్యానని ఆ సమయంలో వచ్చిన కొన్ని ఫలితాలు చూస్తే అనిపిస్తుంది కానీ నిజానికి వాటికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకొని దాని ప్రకారమే పని చేసేవాడు తప్ప పరిస్థితికి తగినట్లుగా మారలేదు. అప్పటికే సమస్యల్లో ఉన్న జట్టులో అతను మరిన్ని విషబీజాలు నాటాడు. కోచ్‌ కొంత మందినే ఇష్టపడుతూ వారి గురించే పట్టించుకునేవాడు. మిగతావారంతా ఎవరి బాధలు వారు పడాల్సిందే. మా కళ్ల ముందే జట్టు ముక్కలైంది’ అని వీవీఎస్‌ తన పుస్తకంలో వివరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top