కోచ్‌గా మజుందార్ ప్రత్యేక ముద్ర
ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర
కొత్తగా టీమ్‌ను తీర్చిదిద్దిన వైనం
సాక్షి క్రీడా విభాగం : అమోల్ మజుందార్‌కు క్రికెట్ మైదానంలో ఆటగాడిగా ఘనమైన రికార్డులు ఉన్నాయి... దేశవాళీ క్రికెట్‌లో ముంబై, అస్సాం, ఆంధ్ర జట్లకు ఆడి టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు... కానీ అందరూ కలలుగనే అంతర్జాతీయ క్రికెటర్ స్థాయి మాత్రం అతనికి దక్కలేదు. వేర్వేరు కారణాలతో ఒక్కసారి కూడా భారత జట్టు తరఫున ఆడే అవకాశం రాలేదు. కెరీర్‌లో చెలరేగుతున్న అతని అత్యుత్తమ దశలో భారత జట్టు దిగ్గజాలతో నిండిపోవడంతో పాటు కాసింత కలిసి రావాల్సిన చోట అదృష్టం మొహం చాటేసింది.
అయితే ఆటగాడిగా ప్రస్థానాన్ని ముగించి తన అనుభవాన్ని మరో రూపంలో ప్రదర్శించుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కోచ్‌గా మారిన మజుందార్ దశాబ్ద కాలం తర్వాత తన కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలను అనుభవిస్తున్నాడు. భారత మహిళల క్రికెట్ జట్టును తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన శిక్షకుడిగా అతను తన పేరును లిఖించుకున్నాడు.
గత రెండేళ్ల ఈ ప్రయాణంలో అతను ఎన్నో ప్రతికూలతలను దాటి టీమ్‌ను శిఖరానికి చేర్చాడు. వచ్చే మంగళవారం తన 51వ పుట్టిన రోజును జరుపుకోనున్న అమోల్ ఇప్పుడు మహిళల క్రికెట్ జట్టు కొత్త ప్రస్థానానికి దిక్సూచిలా నిలిచాడు.

మారిన ఆటశైలి...
‘మా లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా నిర్దేశించుకున్నాం. మన ప్లేయర్లు ఆటలో దూకుడు పెంచాల్సి ఉంది. నిర్భీతిగా ఆడే ఆటను నేను ఎప్పుడైనా ప్రోత్సహిస్తాను. అదే మన శైలి కావాలి. ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ప్రమాణాలను పాటిస్తూ ఏడాదిలో మూడుసార్లు ఫిట్‌నెస్ పరీక్షలు జరుగుతాయి. మ్యాచ్‌లు లేని సమయంలో నిరంతరాయంగా ప్రత్యేక క్యాంప్‌లతో సాధన కొనసాగుతుంది.
కొత్తగా జట్టులోకి వచ్చేవారందరికీ మంచి అవకాశాలు కల్పిస్తాం’... భారత మహిళల జట్టు కోచ్‌గా ఎంపికైన తర్వాత అమోల్ మజుందార్ తన మొదటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటూ పాత గణాంకాలను తాను పట్టించుకోనని, కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నట్లుగా భావిస్తానని కూడా మజుందార్ చెప్పాడు.
వరల్డ్ కప్‌లో భారత ప్లేయర్ల ప్రదర్శనను చూస్తే తాను చెప్పిన ప్రతీ అంశంపై అతను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడని అర్థమవుతుంది. మన ప్లేయర్ల ఫిట్‌నెస్ గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉందనేది చూడగానే అర్థమవుతోంది. అన్నింటికి మించి బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. భారీ స్కోర్లు నమోదు చేయడమే కాదు, ఛేదనలో కూడా మన టీమ్ ఎంత బాగా ఆడగలదో పలుమార్లు రుజువైంది. తమ శ్రమ వెనక కోచ్ ఉన్నాడని ప్లేయర్లు పదే పదే చెప్పడం విశేషం.
ఓటమి తర్వాత ప్రణాళికలతో...
అయితే కోచ్‌గా మజుందార్ బాధ్యతలు స్వీకరించగానే ఒక్కసారిగా ఫలితాలు రాలేదు. మజుందార్ కోచ్‌గా వచ్చి న తర్వాత మొదటి సవాల్ టి20 వరల్డ్ కప్ రూపంలో వచ్చి ంది. ఇందులో మన జట్టు కనీసం సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించలేదు. జట్టులో దూకుడు రాకపోగా కీలక క్షణాల్లో పాత తడబాటు పోలేదని కోచ్‌కు అర్థమైంది. అయితే అతను ఒక్కసారిగా టీమ్‌లో భారీ మార్పులు కోరుకొని గందరగోళంగా మార్చలేదు.
ముందుగా 25 మందితో తన కోర్ టీమ్‌ను ఎంచుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌కు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పక్కాగా ప్రణాళికలు రూపొందించాడు. నాటి టీమ్ లో ఉన్నవారిలో 9 మంది ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో కూడా ఉన్నారు. గాయాలతో మిగతా ఆటగాళ్లు దూరమయ్యారు తప్ప.. లేదంటే అమోల్ ప్రణాళికల్లో అందరికీ వరల్డ్ కప్ బాధ్యతలు ప్రత్యేకంగా ఉన్నాయి.
సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా బోర్డును ఒప్పించడంతో పాటు మిగతా సమయమంతా ప్లేయర్లు జాతీయ క్రికెట్ అకాడమీలోనే రాటుదేలారు. దాని ఫలితం ఇప్పుడు కనిపించింది.
జాగ్రత్తగా నడిపిస్తూనే...
‘జెమీమాను తుది జట్టు నుంచి తప్పించడం మేం తీసుకున్న కఠిన నిర్ణయం. జట్టు సమతూకం కోసం అలా చేయక తప్పలేదు’... ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ తో మ్యాచ్‌కు జెమీమాను దూరం పెట్టిన తర్వాత జట్టు కోచ్ మజుందార్ ఇచ్చి న వివరణ ఇది. ఆ సమయంలో అతను చాలా ఇబ్బంది పడినట్లు, అబద్ధం చెబుతున్నట్లు అతని మాటల్లోనే కనిపించింది.
నిజానికి జెమీమా తొలి 4 మ్యాచ్‌లలో 2 డకౌట్లు సహా 65 పరుగులే చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమెకు ఒక హెచ్చరికలా ఇది సహేతుక నిర్ణయమే. కానీ దానికీ అతను జాగ్రత్తగా వివరణ ఇవ్వాల్సి వచ్చి ంది. ఒక మహిళల టీమ్‌ను పురుష కోచ్ నడిపించడంలో ఉండే ప్రతికూలతల్లో ఇది కూడా ఒకటని విశ్లేషకుల అభిప్రాయం. వారినుంచి అత్యుత్తమ ఆటతీరును రాబట్టడంతో పాటు ప్రోత్సహిస్తూ, ఎక్కడా మానసికంగా కుంగిపోకుండా జట్టును నడిపించడం కూడా కోచ్ బాధ్యతే అవుతుంది.
ఈ విషయం మజుందార్‌కు బాగా తెలుసు. తుది జట్టులో స్థానం విషయంలో తనకంటే ముందు భారత మహిళల జట్టుకు కోచ్‌గా ఉన్న తన మాజీ సహచరుడు, మరో ముంబైకర్ రమేశ్ పొవార్, సీనియర్ మిథాలీ రాజ్ మధ్య ఎంత పెద్ద వివాదం రేగిందో ప్రపంచం చూసింది.
ఇలాంటి అంశాలను జాగ్రత్తగా చూసుకుంటూనే మజుందార్ తన బాధ్యతను నెరవేర్చాడు. సాధారణంగా ఆటగాడిగా సాధించని ఘనతలు కోచ్‌గా అందుకోవాలని చాలా మంది కోరుకుంటారు. తమ పట్టుదలతో వాటిని నిజం చేసుకొనే కొద్ది మంది జాబితాలో ఇప్పుడు అమోల్ చేరాడు.


