
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజం గ్రాహం రీడ్ భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా ఎంపికయ్యారు. ఆయన 2020 ముగిసే వరకు కోచ్ పదవిలో ఉంటారని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం అనంతరం హరేంద్ర సింగ్‌ను అనూహ్యంగా తప్పించిన తర్వాత కోచ్ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు రీడ్ ఆ స్థానంలో బాధ్యతలు చేపడతారు. గత నెలలోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) భారత కోచ్‌గా ఆయన పేరును సిఫారసు చేసింది. రీడ్‌కు నెలకు 15 వేల డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు) వేతనంగా లభిస్తుంది. కుటుంబంతో సహా స్థిరపడిపోయి బెంగళూరు ‘సాయ్’ సెంటర్ కేంద్రంగా ఆయన పని చేయనున్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరం కోసం 60 మంది ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తే రీడ్ కాంట్రాక్ట్‌ను 2022 ప్రపంచ కప్ వరకు పెంచే అవకాశం కూడా ఉంది.
ఘనమైన రికార్డు...
క్వీన్స్‌లాండ్‌కు చెందిన 54 ఏళ్ల గ్రాహం రీడ్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడు. నాలుగు సార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్‌లో కూడా ఆయన భాగంగా ఉన్నారు. డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రీడ్ 36 గోల్స్ చేశారు. 2009లో కోచింగ్‌లో అడుగు పెట్టిన ఆయన 2014లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ నంబర్‌వన్ కావడంలో కీలక పాత్ర పోషించారు. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ టీమ్‌కు కూడా రీడ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు.
‘భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. హాకీలో భారత్‌కు ఉన్నంత గొప్ప చరిత్ర మరే దేశానికి లేదు. చాలా కాలంగా భారత హాకీని దగ్గరినుంచి చూశాను. నాతో పాటు ఆటగాళ్లకు కూడా సానుకూల వాతావరణం ఉండేలా చేయడం నా పని. చాలా దూరంలో ఉన్న ఒలింపిక్స్, వరల్డ్ కప్‌లకంటే కూడా త్వరలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెడతా. భారత హాకీ కోచ్ బాధ్యత చాలా ఒత్తిడితో కూడుకున్నదని నేనూ విన్నా. కానీ దానిని పట్టించుకోను’
–గ్రాహం రీడ్