నంబర్‌వన్‌గా కొనసాగడమే లక్ష్యం

Goal is to continue as number one - Sakshi

ప్రతీ టెస్టు మ్యాచ్‌ కీలకమే

వైస్‌ కెప్టెన్‌ రహానే వ్యాఖ్య   

కోల్‌కతా: భారత జట్టుకు సంబంధించి ప్రతీ సిరీస్‌కు ప్రాధాన్యత ఉందని, అన్ని మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతామని జట్టు వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. ఇటీవల శ్రీలంకను తాము చిత్తుగా ఓడించినా... తాజా పోరులో ఆ జట్టును తేలిగ్గా తీసుకోబోమని రహానే తేల్చి చెప్పాడు. ‘శ్రీలంక గడ్డపై సాధించిన ఘన విజయం ముగిసిన కథ. ఇప్పుడు ఆడబోయే సిరీస్‌ పూర్తిగా కొత్తది కాబట్టి దానితో పోలిక అనవసరం. ప్రస్తుతం టెస్టుల్లో మా నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాం. కాబట్టి ప్రతీ సిరీస్‌కు ప్రాధాన్యత ఉంది. అందుకే అన్ని మ్యాచ్‌లు, సిరీస్‌లు గెలవాలని కోరుకుంటాం. శ్రీలంక కూడా బాగా సన్నద్ధమై వచ్చింది. వారిని తక్కువగా అంచనా వేయడం లేదు. ఇప్పుడు తొలి టెస్టుపైనే మా దృష్టంతా. దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’ అని రహానే స్పష్టం చేశాడు. సొంత ఆటను మెరుగుపర్చుకోవడం నిరంతర ప్రక్రియ అని, అందుకే సాంప్రదాయ భిన్నమైన స్వీప్, రివర్స్‌ స్వీప్, ప్యాడల్‌ స్వీప్‌ షాట్లను తాను ప్రత్యేకంగా సాధన చేస్తున్నానన్న రహానే... తనకు వంద శాతం నమ్మకం వచ్చిన తర్వాతే మ్యాచ్‌లో ఆయా షాట్లను ప్రయత్నిస్తానని చెప్పాడు.  

జోరుగా ప్రాక్టీస్‌...
మంగళవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత జట్టు ప్రాక్టీస్‌ సుదీర్ఘంగా సాగింది. కెప్టెన్‌ కోహ్లి, పుజారా ఎక్కువ సేపు నెట్స్‌లో గడిపారు. పుజారా తన శైలికి భిన్నంగా కొన్ని హుక్‌ షాట్స్‌ కూడా ఆడగా... కార్పెంటర్‌ సహకారంతో తన బ్యాట్‌ మందాన్ని అంగుళం పాటు తగ్గించి కోహ్లి ప్రత్యేకంగా సాధన చేశాడు. భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌ ముగించి వెళ్లిపోయినా, అశ్విన్‌ మాత్రం అదనపు సమయం బౌలింగ్‌ కొనసాగించాడు. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. భారత మాజీ కెప్టెన్, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తొలి టెస్టు జరగనున్న పిచ్‌ను పరిశీలించారు. ‘ఇది మంచి వికెట్‌’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top