భారత పురుషుల జట్టుతో పాటు మహిళల క్రికెట్ జట్టుకు సమాన గౌరవం, పారితోషికాలు ఇవ్వాలని మిథాలీ రాజ్ కోరింది.
లండన్: భారత పురుషుల జట్టుతో పాటు మహిళల క్రికెట్ జట్టుకు సమాన గౌరవం, పారితోషికాలు ఇవ్వాలని మిథాలీ రాజ్ కోరింది. ఇంగ్లండ్‌లో భారత హైకమిషనర్ వై.కె.సిన్హా సోమవారం రాత్రి భారత మహిళల జట్టు గౌరవార్థం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల సారథి మిథాలీ మాట్లాడుతూ ‘ఇప్పుడు అందరు మా వైపు చూస్తున్నారు. మా సహచరులకు బ్రాండింగ్ హక్కులు కూడా దక్కవచ్చు. మంచి భవిష్యత్తు కనిపిస్తుండటంతో బాలికలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు అవకాశాలు ఏర్పడతాయి’ అని చెప్పింది. ఇంగ్లండ్‌తో పరాజయాన్ని జీర్ణించుకునేందుకు మాకు కొంత సమయం పడుతుందని చెప్పింది. తదుపరి జరిగే టి20 ప్రపంచ కప్‌లో భారత మహిళలు దేశం గర్వించే విధంగా ట్రోఫీ సాధిస్తారని చెప్పింది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన భారత వికెట్ కీపర్ సుష్మ వర్మకు డీఎస్‌పీ ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించింది.
టాప్–10లో హర్మన్‌ప్రీత్
భారత హిట్టర్ హర్మన్‌ప్రీత్ ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి దూసుకొచ్చింది. ఏడు స్థానాల్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంకులో నిలిచింది. మిథాలీ రెండో స్థానంలో... పూనమ్ రౌత్ 14వ, వేద కృష్ణమూర్తి 26వ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్‌లో జులన్ గోస్వామి రెండో ర్యాంకుకు ఎగబాకింది.