ప్రధానమంత్రిని అడిగిన హర్లీన్ డియోల్
ప్రపంచకప్ విజేతలతో మోదీ సరదా సంభాషణ
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ విజేతలుగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. బుధవారం తనను కలిసిన క్రికెటర్లను అభినందించిన ఆయన వారితో పలు అంశాలు మాట్లాడారు. ఇందులో బ్యాటర్ హర్లీన్ డియోల్ అడిగిన ప్రశ్న ఒక్కసారిగా నవ్వులు పూయించింది. ప్రధాని చర్మ సంరక్షణ గురించి నేరుగా ప్రధానినే హర్లీన్ అడిగేసింది.
‘మీ చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకోవాలని ఉంది. మీ చర్మం చాలా మెరుస్తూ ఉంటుంది’ అని హర్లీన్ చెప్పింది. దానిపై ప్రధాని కూడా స్పందించారు. ‘నేను ఎప్పుడూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు’ అని ఆయన బదులిచ్చారు. జట్టులోని ఇతర సభ్యులతో కూడా మోదీ విభిన్న అంశాలపై మాట్లాడి వారి స్పందనను తెలుసుకున్నారు.
దీప్తి శర్మ చేతిపై ఉన్న హనుమంతుడి టాటూ గురించి, ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమె జైశ్రీరామ్ అని రాసుకోవడం గురించి కూడా మోదీ అడిగారు. తమ టీమ్‌లో ఐకమత్యం చాలా బలంగా ఉందని, ఎవరు మంచి ప్రదర్శన కనబర్చినా పరస్పరం ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగామని జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. గత జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో తాము కింగ్ చార్లెస్‌తో ఫోటో దిగేందుకు అవకాశం రాగా, ప్రొటోకాల్ నిబంధనల కారణంగా సహాయక సిబ్బందికి అవకాశం దక్కలేదని హెడ్ కోచ్ అమోల్ మజుందార్ గుర్తు చేసుకున్నాడు.
అయితే వరల్డ్ కప్ గెలిచి మన ప్రధానితో ఫోటో దిగుదామని ఆ రోజే తన సహచరులకు చెప్పి ఉత్సాహం నింపానని, అది ఈ రోజు వాస్తవంగా మారిందని అతను అన్నాడు. 2017లో తాము వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన తర్వాత కూడా ప్రధానిని కలిశామని... ఇప్పుడు విజేతగా నిలిచి మళ్లీ వచ్చి గెలవడం సంతోషంగా ఉందని టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది.
ఫైనల్లో చివరి క్యాచ్ అందుకొని బంతిని అపురూపంగా దాచుకోవడంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను కూడా ప్రధాని అడగగా... ‘దేవుడే నేను చివరి క్యాచ్ అందుకునే అవకాశం ఇచ్చాడు. నేను దానిని ఊహించలేదు. ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత దక్కిన విజయమిది. అందుకే ఆ బంతిని నాతోనే ఉంచుకోవాలనుకున్నా’ అని హర్మన్‌ప్రీత్ స్పందించింది.


