మొక్కుబడిగా జీహెచ్‌ఎంసీ శిబిరాలు | GHMC camps as formality | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగా జీహెచ్‌ఎంసీ శిబిరాలు

May 8 2015 2:44 AM | Updated on Sep 3 2017 1:36 AM

ఘనచరిత్ర ఉన్న జీహెచ్‌ఎంసీ వేసవి శిక్షణ శిబిరాలు ఈ ఏడాది మొక్కుబడిగా సాగుతున్నాయి.

ఎల్బీ స్టేడియం : ఘనచరిత్ర ఉన్న జీహెచ్‌ఎంసీ వేసవి శిక్షణ శిబిరాలు ఈ ఏడాది మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రతి యేటా ఏప్రిల్ చివరి వారంలో అట్టహాసంగా ఆరంభమయ్యే ఈ శిబిరాలు ఈ యేడు అంతంత మాత్రం నిర్వహణతో వెలవెలబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే జీహెచ్‌ఎంసీ ఇప్పటికీ అధికారికంగా ఈ శిబిరాలను ప్రారంభించలేదు. నగరంలో అక్కడక్కడ ఉన్న ప్లే గ్రౌండ్స్‌లో స్థానిక అధికారుల నేతృత్వంలో అరకొరగా సాగుతున్నాయి.

యేటికేడు భారీ ఎత్తున నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఈ వేసవిలో ఒక్కసారిగా డీలాపడిపోయాయి. దీనికి గల కారణాలను మాత్రం సంబంధిత అధికారులు స్పష్టంగా వెల్లడించడం లేదు. దీనిపై పలు క్రీడా సంఘాలు, క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ నగర పాలక సంస్థ చేపట్టని విధంగా జీహెచ్‌ఎంసీ (అప్పటి ఎంసీహెచ్) ఈ శిబిరాలకు 1968లో శ్రీకారం చుట్టింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు... అప్పట్లో కేవలం పది మైదానాల్లో కేవలం 15 మంది కోచ్‌లతో 1400 మంది చిన్నారుల శిక్షణతో ఆరంభమైన ఈ శిబిరాలు తదనంతరం వందల మైదానాల్లో వేయి మంది కోచ్‌లతో నిర్వహించే స్థాయికి చేరుకుంది.

సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్ ఇలా ఐదు జోన్లలోని 18 సర్కిళ్లలో ఉన్న 150 డివిజన్లలో ప్రతి వేసవిలోనూ క్యాంపులను నిర్వహించేవారు. ఈ శిబిరాల్లో సుమారు లక్ష మంది ఔత్సాహిక క్రీడాకారులు కేవలం నామమాత్రపు ఫీజుతో శిక్షణ తీసుకునేవారు. కొన్ని క్రీడాంశాలకైతే ఉచితంగానే శిక్షణ ఇస్తారు. ఆరేళ్ల నుంచి 18 ఏళ్ల బాలబాలికలు ఈ శిబిరాల్లో పాల్గొనేవారు. భారీ ఎత్తున 52 క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ద్వారానే పలువురు వెలుగులోకి వచ్చారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి హైదరాబాద్ సత్తాచాటుకున్నారు. అయితే ఇంతటి చరిత్ర ఉన్న ఈ శిబిరాలను జీహెచ్‌ఎంసీ క్రీడాధికారులు ఈ ఏడాది విస్మరించారు. ఏమైనా నిధుల కొరతా?... అంటే అదీ లేదు. ఎందుకంటే అందుబాటులో రూ. 10 కోట్ల బడ్జెట్ ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున శిబిరాలను నిర్వహించలేకపోయారు.

క్రీడలకు, క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలంటూ ప్రకటనలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  కూడా జీహెచ్‌ఎంసీ శిబిరాలవైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు స్పెషల్ కమిషనర్ ఏలుబడిలో ఉన్న జీహెచ్‌ఎంసీ పాలక మండలి నిర్వాకంపై నగరానికి చెందిన పలు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement