ధోనికి ఎలా చోటిస్తారు..?

 Gautam Gambhir On MS Dhoni's Comeback Chances - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) జరగకపోతే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని జాతీయ జట్టులోకి రీఎంట్రీ అనేది దాదాపు అసాధ్యమేనని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌పై ధోని భవితవ్యం ఆధారపడి వుందనేది కాదనలేని సత్యమని గంభీర్‌ పేర్కొన్నాడు. సుమారు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన ధోనికి జట్టులోకి తీసుకోవడానికి ఏ ప్రాతిపదికా లేదన్నాడు. ధోని స్థానంలో కేఎల్‌ రాహుల్‌ అత్యుత్తమని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ధోనికి ప్రత్నామ్నాయం రాహులేనన్నాడు. గత కొంతకాలంగా రాహుల్‌ ప్రదర్శన చూస్తున్నానని, అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడన్నాడు. కీపింగ్‌లో ధోనిలా పూర్తి స్థాయిలో చేయలేకపోయినా రాహుల్‌ మాత్రం తన రోల్‌కు న్యాయం చేస్తున్నాడనే విషయం ఇటీవల చూశానన్నాడు. రాహుల్‌ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తే భారత జట్టుకు లాభిస్తుందన్నాడు. (నా బ్యాటింగ్‌ స్టైల్‌కు ప్రేరణ అంగధ్‌జీ..)

2019 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ తర్వాత ధోని పూర్తిగా ఆటకు దూరమయ్యాడు.  కొంతకాలం ధోని విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానంలో రిషభ్‌ పంత్‌కు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించారు. కాగా, పంత్‌ పదే పదే విఫలం కావడంతో అతన్ని తప్పించి కేఎల్‌ రాహుల్‌ చేత కీపింగ్‌ చేయించారు. ఇక రాహుల్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌లో మెరవడంతో పంత్‌ పక్కకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం పంత్‌ను పట్టించుకోని టీమిండియా మేనేజ్‌మెంట్‌ రాహుల్‌పైనే ఎక్కువ ఫోకస్‌ చేసింది. మరొకవైపు మాజీలు కూడా రాహుల్‌కే ఓటేయడంతో స్పెషలిస్టు కీపర్‌ అంశాన్ని లైట్‌ తీసుకుంటున్నారు. ఒకవేళ పంత్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారాలంటే వరుసగా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాలి. అందుకు ఐపీఎల్‌ను వినియోగించుకుందామని పంత్‌ చూసినా అది జరిగే అవకాశాలు సన్నగిల్లడంతో ఆ యువ వికెట్‌ కీపర్‌ డైలమాలో పడ్డాడు. ధోని ఎదుర్కొంటున్న పరిస్థితినే పంత్‌ కూడా చూస్తున్నాడనేది వాస్తవం. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ ఏప్రిల్‌15కు వాయిదా పడింది. మార్చి 29వ తేదీన జరగాల్సిన ఈ లీగ్‌ను వాయిదా వేశారు. ఇంకా కరోనా ప్రభావం తగ్గకపోవడంతో ఐపీఎల్‌ను రద్దు చేస్తారా.. లేక వేరే ప్రత్యామ్నాయ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారో చూడాలి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top