క్రికెట్‌ చరిత్రలో 19 ఏళ్ల క్రితం..

Ganguly and Rahul Dravid Made Merry in Taunton - Sakshi

ప్రపంచ రికార్డు నమోదు చేసిన భారత దిగ్గజాలు

సాక్షి, హైదరాబాద్‌ : సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు (మే26,1999) క్రికెట్‌ చరిత్రలో ఓ అద్భుత రికార్డు నమోదైంది. భారత దిగ్గజ క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌లు సంయుక్తంగా ఈ ఘనతను అందుకున్నారు.1999 ప్రపంచకప్‌లో టాంటన్‌(ఇంగ్లండ్‌) వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏకంగా 157 పరుగులతో విజయం సాధించింది. కెరీర్‌ తొలి దశల్లో ఉన్న భారత దిగ్గజాలు గంగూలీ, ద్రవిడ్‌లు సెంచరీలతో చెలరేగి రెండోవికెట్‌కు అత్యధికంగా 318 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఆ సమయంలో వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇక అప్పటి వరకు జింబాంబ్వేపై టీమిండియా దిగ్గజాలు ఆజారుద్దీన్‌, అజయ్‌ జడేజాలు పేరిట నాలుగో వికెట్‌కు నెలకొల్పిన 275 పరుగుల భాగస్వామ్యమే అత్యుత్తమం. ఈ రికార్డును గంగూలీ-ద్రవిడ్‌లు ఈ మ్యాచ్‌ ద్వారా అధిగమించారు. అనంతరం ఈ రికార్డును సచిన్‌, ద్రవిడ్‌లు 1999లోనే 372 పరుగుల భాగస్వామ్యంతో బ్రేక్‌ చేశారు. ప్రస్తుతం ఈ జాబితాలో వెస్టిండీస్‌ ఆటగాళ్లు క్రిస్‌గేల్‌- సామ్యుల్స్‌ 372 పరుగుల భాగస్వామ్యంతో తొలి స్థానంలో ఉండగా సచిన్- ద్రవిడ్‌లు రెండో స్థానంలో, గంగూలీ-ద్రవిడ్‌లు మూడో స్థానంలో ఉన్నారు. 

చెలరేగిన గంగూలీ..
119 బంతుల్లో సెంచరీ సాధించిన గంగూలీ మరో 39 బంతుల్లోనే 183కు చేరుకున్నాడు. మొత్తం 158 బంతులు ఎదుర్కున్న గంగూలీ 17 ఫోర్లు, 7 సిక్స్‌లతో లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ప్రపంచకప్‌ చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా గంగూలీ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 188* పరుగులతో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిరెస్టన్‌ తొలి స్థానంలో ఉన్నాడు. యునైటెడ్‌ ఎమిరేట్స్‌ జట్టుపై 1996 ప్రపంచకప్‌లో గ్యారీ కిరెస్టెన్‌ ఈ రికార్డును నెలకొల్పాడు. 

భారత్‌కు ఇదే అత్యధికం
గంగూలీ-ద్రవిడ్‌ల భాగస్వామ్యంతో భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 373 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ప్రపంచకప్‌ చరిత్రలో ఆ సమయంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ స్కోర్‌. అనంతరం 2007లో బెర్ముడాపై 413 పరుగులు సాధించింది.  374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రాబిన్‌ సింగ్‌ (5 వికెట్లు) దాటికి 216 పరుగులకే కుప్పకూలింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top