ఐపీఎల్‌కు ఎదురుదెబ్బ  | Foreign Players Not Available For IPL 2020 Till April 15 Due To Visa Restrictions | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ : ఏప్రిల్‌ 15 వరకు ఆ ఆటగాళ్లు దూరం 

Mar 12 2020 2:37 PM | Updated on Mar 12 2020 4:19 PM

Foreign Players Not Available For IPL 2020 Till April 15 Due To Visa Restrictions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 29నుంచి ఆరంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)13వ సీజన్‌పై కరోనా వైరస్‌ నీడలు కమ్ముకుంటున్నాయి. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 15 వరకు విదేశీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో విదేశీ క్రికెటర్లు అప్పటివరకూ ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చే చాన్స్‌ లేదు. ఫలితంగా ఐపీఎల్‌పై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయంగా కన్పిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ ప్రారంభం అవుతుందని ఓ వైపు బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ పదే పదే చెప్తున్నా... అది సాధ్యం కాదని, ఐపీఎల్‌ వాయిదా ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్‌ కొనసాగడం అసాధ్యమని అంటున్నారు. (టికెట్ల అమ్మకాలను నిలిపివేయించిన మహారాష్ట్ర)

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని విదేశీయుల వీసాలను ఏప్రిల్ 15 వరకు కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో టోర్నీకి విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మార్చి 14న సమావేశం కానుంది. ఆ సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  అటు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించలేమని ఇప్పటికే చాలా రాష్ట్రాలు చేతులెత్తేశాయి.తాజా పరిస్థితుల్లో లీగ్‌ నిర్వహణ కష్టమని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాశాయి. రాష్ట్రంలో అధికారికంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలను నిలిపివేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ తరుణంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ ఈ ఏడాది తాత్కాలికంగా రద్దయినట్లేనని.. ఇదే విషయాన్ని గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ లీగ్‌ ఉంటుందో లేదో ఈనెల 14న తేలనుంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం వరకు 73 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఇంచుమించుగా లక్షా 18వేలకు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు దాదాపు 4,250 మంది మృతి చెందారు.(కరోనా భయం.. ఐపీఎల్‌ సాధ్యమేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement