కోహ్లి సేనకు దిమ్మతిరిగే షాక్‌..!

 England vs India third ODI | England cruises along nicely with the chase - Sakshi

సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమి

చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం.. 2–1తో వన్డే సిరీస్‌ సొంతం

బయటపడ్డ వైఫల్యాలు.. 8 వికెట్లతో భారత్‌ ఓటమి

గెలిపించిన మోర్గాన్, రూట్‌.. ఆగస్టు 1 నుంచి టెస్టు సిరీస్‌   

టి20 సిరీస్‌ విజయం తెచ్చిన ఊపులో వన్డే సిరీస్‌ కూడా గెలుచుకోవాలనుకున్న భారత్‌ ఆశలు నెరవేరలేదు. ముందుగా బ్యాటింగ్‌ వైఫల్యం, ఆపై నిస్సారమైన బౌలింగ్‌ కలగలిసి చివరి వన్డే ప్రత్యర్థిపరం కావడంతో సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌ కోల్పోయింది. సొంతగడ్డపై సాధికార ప్రదర్శన చేసిన ఇంగ్లండ్‌ పరువు నిలబెట్టుకుంది. టి20 వైఫల్యం తర్వాత వన్డే సిరీస్‌ గెలుచుకొని మోర్గాన్‌ సేన సత్తా చాటింది. గత పర్యటనలో వన్డే సిరీస్‌ గెలుచుకున్న భారత్‌కు ఇది నిరాశాజనక ప్రదర్శన కాగా... ఆగస్టు 1 నుంచి జరిగే ఐదు టెస్టుల సిరీస్‌తో మరో భారీ పోరుకు తెర లేవనుంది.  

లీడ్స్‌: వన్డేల్లో నంబర్‌వన్‌ ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఇంగ్లండ్‌ మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (72 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... శిఖర్‌ ధావన్‌ (49 బంతుల్లో 44; 7 ఫోర్లు), ధోని (66 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం ఇంగ్లండ్‌  44.3 ఓవర్లలో 2 వికెట్లకు 260 పరుగులు చేసి విజయాన్నందుకుంది. జో రూట్‌ (120 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీ సాధించగా, ఇయాన్‌ మోర్గాన్‌ (108 బంతుల్లో 88 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా చెలరేగాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 35.2 ఓవర్లలో అభేద్యంగా 186 పరుగులు జోడించారు.  ఆదిల్‌ రషీద్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. 

కోహ్లి అర్ధ సెంచరీ... 
సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో భారత్‌కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. రోహిత్‌ శర్మ (2) ఈ మ్యాచ్‌లో పూర్తిగా తడబడ్డాడు. విల్లీ వేసిన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ఆడిన అతను... ఒక దశలో వరుసగా ఏడు డాట్‌ బంతులు ఆడి తర్వాతి బంతికి వికెట్‌ అప్పగించేశాడు. అనంతరం ధావన్, కోహ్లి కలిసి బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్లంకెట్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి ధావన్‌ జోరు ప్రదర్శించగా, అలీ బౌలింగ్‌లో 23 పరుగుల వద్ద బట్లర్‌ క్యాచ్‌ వదిలేయడంతో కోహ్లి బతికిపోయాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 12 ఓవర్లలో 71 పరుగులు జోడించిన అనంతరం ధావన్‌ రనౌట్‌ ఈ జోడీని విడదీసింది. మిడ్‌ వికెట్‌ దిశగా ఆడి ముందుగా పరుగు కోసం ప్రయత్నించిన కోహ్లి ఆపై నిరాకరించాడు. అయితే అవతలి ఎండ్‌ నుంచి అప్పటికే ముందుకొచ్చిన ధావన్‌ వెనుదిరిగే ప్రయత్నం చేసినా... స్టోక్స్‌ డైరెక్ట్‌ హిట్‌ అప్పటికే వికెట్లను తాకింది. రాహుల్‌ స్థానంలో మ్యాచ్‌ బరిలోకి దిగిన దినేశ్‌ కార్తీక్‌ (21) కొద్దిసేపు కెప్టెన్‌కు అండగా నిలి చినా... తనకు వచ్చిన మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. 55 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి కాగా, 24 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 124 పరుగులకు చేరింది. ఈ దశలో ఆదిల్‌ రషీద్‌ స్పెల్‌ టీమిండియాను దెబ్బ తీసింది. ముందుగా కార్తీక్‌ను బౌల్డ్‌ చేసిన రషీద్‌ ఇన్నింగ్స్‌ 31వ ఓవర్లో చెలరేగాడు. అతను వేసిన అద్భుతమైన లెగ్‌ బ్రేక్‌ కోహ్లి బ్యాట్‌ను ఛేదించి వికెట్లను కూల్చింది. అనూహ్యమైన ఈ బంతికి బిత్తరపోయిన కోహ్లి కొద్దిసేపు పిచ్‌ను, బౌలర్‌ను చూస్తూ షాక్‌లో నిలిచిపోయాడు! అదే ఓవర్‌ చివరి బంతికి రైనా (1) కూడా ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాలు పెరిగాయి. ఈ దశలో ధోని జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. గత మ్యాచ్‌లాగే అతని ఆటలో వేగం లేకపోయినా... పరిస్థితిని చక్కబెట్టేందుకు క్రీజ్‌లో గట్టిగా నిలబడ్డాడు. ఈ క్రమంలో ధోనికి తోడుగా హార్దిక్‌ పాండ్యా (21), భువనేశ్వర్‌ (21), శార్దూల్‌ ఠాకూర్‌ (22 నాటౌట్‌) చేసిన పరుగులు స్కోరును 250 పరుగులు దాటించాయి. 48వ ఓవర్‌ వరకు భారత్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ కూడా లేకపోగా... స్టోక్స్‌ వేసిన తర్వాతి ఓవర్లో శార్దుల్‌ రెండు భారీ సిక్సర్లు బాదడం విశేషం. చివరి 10 ఓవర్లలో భారత్‌ సరిగ్గా 60 పరుగులు సాధించింది.  

భారీ భాగస్వామ్యం... 
సాధారణ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు బెయిర్‌స్టో అదిరే ఆరంభం అందించాడు. భువనేశ్వర్‌ ఓవర్లో నాలుగు ఫోర్లతో చెలరేగిన అతడు, పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో మరో మూడు ఫోర్లు బాదాడు. ఇదే ఊపులో శార్దుల్‌ బౌలింగ్‌లో మరో షాట్‌కు ప్రయత్నించి మిడ్‌వికెట్‌లో రైనాకు క్యాచ్‌ ఇవ్వడంతో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఎండ్‌లో విన్స్‌ (27 బంతుల్లో 27; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో స్కోరు దూసుకుపోయింది. అయితే పాండ్యా చక్కటి ఫీల్డింగ్‌కు ధోని చురుకుదనం కలగలిసి విన్స్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్‌ స్కోరు 78 పరుగులకు చేరింది. ఈ దశలో రూట్, మోర్గాన్‌ కలిసి ప్రశాంతంగా ఆడుకున్నారు. చక్కటి సమన్వయంతో ఆడిన వీరిద్దరు భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా స్కోరుబోర్డును నడిపించారు. మధ్య ఓవర్లలో  తడబాటు లేకుండా భారత స్పిన్‌ ద్వయం చహల్, కుల్దీప్‌ యాదవ్‌లను ఎదుర్కొన్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ వికెట్‌ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో రూట్‌ 69 బంతుల్లో, మోర్గాన్‌ 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రూట్‌ 52 పరుగుల వద్ద ఉన్నప్పుడు శార్దుల్‌ బౌలింగ్‌లో ధోని క్యాచ్‌ వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఇంగ్లండ్‌ స్కోరు 200 దాటిన తర్వాత రూట్‌ను ధోని స్టంపౌట్‌ చేసినా... చహల్‌ వేసింది నోబాల్‌గా తేలింది. ఆ తర్వాత మరో చాన్స్‌ ఇవ్వకుండా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ మరో 5.3 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top