
రెండు అత్యుత్తమ టి20 జట్లు తలపడుతున్నప్పుడు 40 ఓవర్ల మ్యాచ్‌లో పరిస్థితులకంటే టాసే కీలకం. పొట్టి ఫార్మాట్‌లో టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవర్‌ప్లేలో వికెట్‌లు కోల్పోకపోతేనే భారీ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా టాస్‌పై ఆధారపడి ఉంది. మొత్తానికి ఈ రెండు అంశాలు తుది ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు సురక్షిత లక్ష్యం అంటూ ఉండదు. దీంతో పాటు తొందరపాటులో వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే భారీ స్కోరు నమోదు చేయడం కష్టం. ఆ తర్వాత బరిలో దిగిన జట్టుకు ఈ ఇబ్బంది ఉండదు. సాధించాల్సిన రన్‌రేట్‌ను బట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే వీలు చిక్కుతుంది. కార్డిఫ్‌లో భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. మరోసారి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోవడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరిగింది.
ఇక తొలి మ్యాచ్‌లో కుల్దీప్ స్పిన్‌కు దాసోహమైన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆ తర్వాత అతన్ని ఎదుర్కొనేందుకు మెర్లిన్ అనే ప్రత్యేక బౌలింగ్ యంత్రంతో ప్రాక్టీస్ చేయడంతో పాటు తమ తప్పుల నుంచి త్వరగానే పాఠాలు నేర్చుకున్నారు. ఎక్కువ మంది ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కుల్దీప్‌ను బ్యాక్‌ఫుట్‌పై ఎదుర్కొన్న తీరు చూస్తే... వారు అతడి బౌలింగ్‌పై ఎంత కసరత్తు చేశారో అర్థమవుతోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన హేల్స్ ఇక్కడ మోర్గాన్, బట్లర్‌లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. గత మ్యాచ్‌లో కుల్దీప్‌కు చిక్కిన ఈ ముగ్గురు బ్యాక్‌ఫుట్ మంత్రంతోనే రాణించగలిగారు.