పట్టుబిగించిన ఇంగ్లండ్‌

England Build Lead Of 264 Over South Africa After Day Three - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ పట్టుబిగించింది. తొలుత జేమ్స్‌ అండర్సన్‌ (5/40) బౌలింగ్‌లో విజృంభించడంతో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో సిబ్లీ (85 బ్యాటింగ్‌; 13 ఫోర్లు), సారథి జో రూట్‌ (61; 7 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో... ఆదివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. దీంతో 264 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 215/8తో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన ప్రొటీస్‌ జట్టు మరో 8 పరుగులు చేసి మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది.  

స్టోక్స్‌ రికార్డు క్యాచ్‌...
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు (5) అందుకున్న తొలి ఇంగ్లండ్‌ ప్లేయర్‌గా, ఓవరాల్‌గా 12వ ఫీల్డర్‌గా (వికెట్‌ కీపర్లు కాకుండా) బెన్‌ స్టోక్స్‌ రికార్డు సృష్టించాడు. ఆదివారం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా నోర్జే ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడం ద్వారా స్టోక్స్‌ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఈ ఐదు క్యాచ్‌లను స్టోక్స్‌ రెండో స్లిప్‌లోనే అందుకున్నాడు. అత్యధిక క్యాచ్‌లు (5) అందుకున్న ఫీల్డర్‌గా 11 మంది పేరిట సంయుక్తంగా రికార్డు ఉండగా ఈ జాబితాలో స్టోక్స్‌ కూడా చేరాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top