
లండన్: ఒకసారి కాదు...రెండు సార్లు కాదు... ప్రతీ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు ఆశలు ఏదో కారణంతో కుప్పకూలిపోవడం రొటీన్‌గా మారిపోయింది. 1992 నుంచి అన్ని ప్రపంచ కప్‌లలో గెలుపు అవకాశాలు కనిపిస్తూ చివరకు ఓడి ‘చోకర్స్’గా సఫారీ జట్టు ముద్ర వేసుకుంది. 2015 సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి గుండె బద్దలైన క్షణాన సఫారీ జట్టు ఆటగాళ్లంతా చిన్నపిల్లల్లా రోదించారు. అయితే ఈ సారి ఎలాగైన మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ గెలవాలని ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన సఫారీ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభావం ఎదురైంది. ఏకంగా 104 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఆతిథ్య ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడించింది.
అయితే మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ తమ ఆటగాళ్ల ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రదర్శనతో కప్ గెలవడం కాదుకదా లీగ్ కూడా దాటలేమని తోటి ఆటగాళ్లను హెచ్చరించాడు. ‘ఇంగ్లండ్ అన్ని రంగాల్లో మా కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. తొలుత మా బౌలింగ్ దారుణంగా విపలమైంది. ఎన్‌గిడి పర్వాలేదనిపించినా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. మా ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో నాతో సహా అందరం దారుణంగా విఫలమయ్యాం. ఇలా అయితే లీగ్ కూడా దాటలేం. ఇప్పటికైనా మేల్కోండి. ఆటగాళ్లందరిని ఒకటే కోరుకుంటున్నాను దయచేసి బాగా ఆడి మెరుగైన ప్రదర్శన ఇవ్వండి’అంటూ డుప్లెసిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సఫారీ జట్టు ప్రదర్శనపై ఆ జట్టు అభిమానులు, మాజీ ఆటగాళ్లు దుమ్మెత్తిపోస్తున్నారు.