‘నా కెరీర్‌ను కాపాడింది లక్ష్మణ్‌ ఇన్నింగ్సే’

Dropping VVS Laxman from India ODI squad maybe was a mistake, Ganguly - Sakshi

కోల్‌కతా: దాదాపు 17 ఏళ్ల క్రితం ఆసీస్‌తో జరిగిన టెస్టులో వీవీఎస్‌ లక్ష్మణ్‌ సాధించిన 281 పరుగుల్ని ఆనాటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మరోసారి గుర్తు చేసుకున్నాడు. కోల్‌కతాలో జరిగిన ఆ టెస్టులో లక్ష్మణ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించకపోతే ఆ సిరీస్‌లో టైటిల్‌ను సాధించలేకపోయేవాళ్లమన్నాడు. ఒకవేళ ఆ టెస్టు మ్యాచ్‌ను కోల్పోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేవన్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌ను కోల్పోయిన పక్షంలో తాను మళ్లీ కెప్టెన్‌ అయ్యేవాడిని కాదంటూ లక్ష్మణ్‌ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు. అదొక అసాధారణ ఇన్నింగ్స్‌ అంటూ గంగూలీ కొనియాడాడు. అప్పటి లక్ష్మణ్‌ ఇన్నింగ్స్‌ కచ్చితంగా తన కెరీర్‌ను కాపాడిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 

అయితే టెస్టుల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ను.. 2003 వరల్డ్‌కప్‌ నుంచి తప్పించడం తాము చేసిన పొరపాటు కావొచ్చన్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ వరల్డ్‌కప్‌లో లక్ష్మణ్‌ను తప్పించిన గంగూలీ.. దినేశ్‌ మోంగియాకు అవకాశం కల్పించాడు.   ఆ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. ఆ కీలక మ్యాచ్‌లో దినేశ్‌ మోంగియా ఫెయిల్‌ కావడంతో గంగూలీపై విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై మాట్లాడిన గంగూలీ.. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న లక్ష్మణ్‌ను తప్పించడం తప్పిదం కావొచ్చనే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. కాకపోతే ఒక కెప్టెన్‌గా తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు సరైనవిగా ఉంటే, మరికొన్ని సార్లు తప్పిదాలుగా మారుతాయన్నాడు. అప్పటి పరిస్థితుల్ని బట్టి జట్టు ఎంపిక జరిగిందన్నాడు.  

2001లో భారత్‌ పర్యటనకు వచ్చిన ఆసీస్‌.. తొలి టెస్టులో గెలిచి మంచి జోరు మీద ఉంది. అయితే రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్‌ 281 పరుగులు నమోదు చేయగా ద్రావిడ్‌ 180 పరుగులతో మెరిశాడు. వీరి ఇన్నింగ్స్‌లు భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆపై మూడో టెస్టులో భారత్‌ విజయం నమోదు చేయడంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top