ఇక్కడ ధోనినే టాప్‌!

Dhoni Record partnerships at 5th wicket in t20s - Sakshi

సెంచూరియన్‌:ఎంఎస్‌ ధోని టీ 20లకు పనికిరాడు.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించిన విమర్శ. యువ క్రికెటర్లు వస్తుంటే ఇంకా ధోని టీ20ల్లో ఎందుకు కొనసాగుతున్నాడంటూ దిగ్గజ ఆటగాళ్ల సైతం నోరు పారేసుకున్నారు. వాటికి ధోని తన బ్యాట్‌తోనే సమాధానమిస్తూ కూల్‌గా తన పని చేసుకుపోతున్నాడు. తాజాగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ధోనీ (52 నాటౌట్; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. అదే క్రమంలో మనీష్ పాండే (79 నాటౌట్; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలసి అజేయంగా ఐదో వికెట్‌కు 98 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

తద్వారా తనకు భాగస్వామ్యాలు నెలకొల్పడంలో తిరుగులేదని మరోసారి నిరూపించాడు. అంతర్జాతీయ టీ 20ల్లో భారత తరపున ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాలను నమోదు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక్కడ అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ మారుతున్నా ధోని మాత్రం స్థిరంగా ఉండి భాగస్వామ్యాలను నమోదు చేస్తునే ఉన్నాడు. ఒకసారి టీ20ల్లో ఐదో వికెట్‌కు ధోని సాధించిన భాగస్వామ్యాలు పరిశీలిద్దాం.  

టీ 20ల్లో ఐదో వికెట్‌కు భారత తరపున అత్యధిక భాగస్వామ్యం 102 పరుగులు. 2013లో ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, ధోనీ కలసి ఐదో వికెట్‌కు అజేయంగా 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీని తర్వాత నిన్నటి మ్యాచ్‌లో పాండే, ధోనీ నెలకొల్పిన 98 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది.

ఇక 2007లో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతోనే జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ధోనీ ఐదో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2014లో మళ్లీ యువరాజ్‌సింగ్‌తో కలసి ఆస్ట్రేలియాపై 84 పరుగుల భాగస్వామ్యాన్ని ధోని నిర్మించాడు. ఇక 2016లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లితో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని ధోని జత చేశాడు. ఇలా టీ 20ల్లో ఐదో వికెట్‌కు భారత టాప్ -5 భాగస్వామ్యాల్లో నాలుగుసార్లు ధోని భాగస్వామ్యం కావడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో విరాట్‌ కోహ్లి-యూసఫ్‌ పఠాన్ ‌(2010లో జింబాబ్వేపై 64 పరుగుల భాగస్వామ్యం) జంట, రోహిత్‌ శర్మ-హార్దిక్‌ పాండ్యా(2016లో బంగ్లాదేశ్‌పై 61 పరుగుల భాగస్వామ్యం) ద్వయం ఉన్నారు. ప్రధానంగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఐదో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాలు నమోదు చేస్తున్న ధోని.. టీ 20లకు ఫిట్‌ అవుతాడో..లేదో అనే దానికి విమర్శకులే సమాధానం చెప్పాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top