రాంచీలో ధోని ఏదో చేశాడు.. లేకపోతే ఎలా?

Dhoni Must Have Done Something In Ranchi, Piyush Chawla - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఎంఎస్‌ ధోని ఎక్కడ కూడా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడలేదు. కేవలం ప్రాక్టీస్‌ వరకూ పరిమితమైన ధోని.. భారత జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు తెరలేచాయి. అయితే వాటిపై ధోని నుంచి ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోగా, ఐపీఎల్‌ ఆడటమే లక్ష్యంగా ప్రాక్టీస్‌ చేశాడు కూడా. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29వ తేదీన ఐపీఎల్‌ ఆరంభం కావాల్సి ఉండగా ధోని నెల ముందుగానే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ఆరంభించాడు. సీఎస్‌కే సన్నాహకంలో భాగంగా ఆటగాళ్లతో కలిసి ధోని ముమ్మర ప్రాక్టీస్‌ చేశాడు. అయితే కరోనా వైరస్‌ కారణంగా మొత్తం అంతా అస్తవ్యస్తం కావడంతో ఐపీఎల్‌ వాయిదాలు పడుతూ వస్తుంది. ఇప్పటికైతే ఐపీఎల్‌పై ఎటువంటి స్పష్టత లేకపోయినప్పటికీ, జరుగుతుందనే ఆశ మాత్రం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాకే ఐసీసీ మొగ్గుచూపిన క్రమంలో ఐపీఎల్‌పై ఆశలు చిగురించాయి. (‘ఈ ఏడాది ఐపీఎల్‌లో నాకు చాన్స్‌ ఉంది’)

ఇదిలా ఉంచితే, ధోని నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ గురించి సహచర ఆటగాడు, స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా కొన్ని సందేహాలు వ్యక్తం చేశాడు. ప్రధానంగా నెట్స్‌లో ధోని హిట్టింగ్‌ చేయడంపై చావ్లా విశ్లేషించాడు. మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రాతో యూట్యూబ్‌ చానెల్‌లో ముచ్చటించాడు. ఈ క్రమంలోనే రాంచీలో ధోని ఏదో చేశాడనే అనుమానం వ్యక్తం చేశాడు చావ్లా. ‘ ఒక సుదీర్ఘమైన బ్రేక్‌ తర్వాత ధోని నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన తీరుతో ఆశ్చర్యపోయా. నిజాయితీగా చెప్పాలంటే ఎప్పటి మాదిరిగానే బంతుల్ని హిట్‌ చేశాడు. ఒక ఐదు-ఆరు బంతుల్ని చూసేవాడు.. ఆ తర్వాత భారీ షాట్లు ఆడేవాడు. ధోని ఏదో(మనకు ఎవరు తెలియకుండా)చేసి ఉంటేనే ఈ తరహా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం సాధ్యం. రాంచీ(ధోని స్వస్థలం)లో ఏదో చేసి ఉండాలి. లేకపోతే అంతటి భారీ షాట్లు ఆడటం కష్టం. ఎటువంటి అలసటా లేకుండా నిర్విరామంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. ఆ క్యాంపులో కొద్ది మంది మాత్రమే క్రికెటర్లు ఉన్నాం. రైనా, రాయుడు, ధోని భాయ్‌ ఇలా కొద్ది మందితో మాత్రమే శిక్షణా శిబిరంలో ప్రాక్టీస్‌ చేసే వాళ్లం. ప్రతీ బ్యాట్స్‌మన్‌ 200 నుంచి 250 బంతులు ప్రాక్టీస్‌ చేసేవారు. కనీసం రెండున్నర గంటలు విరామం లేకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యేవారు’అని సీఎస్‌కే స్పిన్నర్‌ చావ్లా తెలిపాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top