‘ఈ ఏడాది ఐపీఎల్‌లో నాకు చాన్స్‌ ఉంది’

Sreesanth Names Three Teams He Would Like To Bid For Him - Sakshi

ఆ మూడు జట్లకు ఐపీఎల్‌లో ఆడాలని ఉంది

రీ ఎంట్రీపై శ్రీశాంత్‌

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌–2013లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల శిక్షా కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగించుకోబోతున్న భారత వెటరన్‌ పేసర్‌ శ్రీశాంత్‌ రీఎంట్రీ దాదాపు షురూ అయ్యింది.  కేరళ ఆటగాడైన శ్రీశాంత్‌ను ఆ జట్టు రంజీ ట్రోఫీల్లో తీసుకోవడానికి ఇప్పటికే సుముఖంగా ఉన్న నేపథ్యంలో అతని పునరాగమనం ఖాయమైంది. కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీశాంత్‌ తనకు వచ్చిన ప‍్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. (‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’)

క్రిక్‌ ట్రేకర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో మాట్లాడిన శ్రీశాంత్‌.. ఐపీఎల్‌లో ఏయే జట్లకు ఆడాలనే ఉందనే విషయాన్ని వెల్లడించాడు. తన తొలి ప్రాధాన్యత ముంబై ఇండియన్స్‌గా శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. గతంలో ముంబైకు ఆడిన సందర్భంలో తనకు లభించిన మద్దతు కారణంగానే ఆ జట్టుకు మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపాడు. సచిన్‌ టెండూల్కర్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ నుంచి తనకు ఎంతగానో సహకారం లభించిన విషయాన్ని శ్రీశాంత్‌ ప్రస్తావించాడు. మరొకవైపు విరాట్‌ కోహ్లి నేతృత్వం వహించే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో పాటు, ఎంఎస్‌ ధోని సారథ్యం వహించే చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు కూడా ఆడాలని ఉందన్నాడు. 

ఈ మూడు జట్లలో ఒకదానికి ఆడాలని అనుకుంటన్నట్లు శ్రీశాంత్‌ మనసులోని మాటను వెల్లడించాడు. కాగా, చివరకు ఏ జట్టు తనను తీసుకున్నా ఆడతానన్నాడు. ‘ ముంబైకు తొలి ప్రాధాన్యత. ఆ తర్వాత ఆర్సీబీ, సీఎస్‌కేలకు ఆడాలనుకుంటున్నా. ఒక వేళ ఆ మూడు జట్లు కాకపోతే ఏ జట్టు తీసుకున్నా ఆడతా. క్రికెట్‌ అభిమానిగా ముంబై ఇండియన్స్‌ అంటే బాగా ఇష్టం. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ పాజీని కలిసే అవకాశం ఉంటుంది. సచిన్‌ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అవకాశం వస్తే ముంబైకు ఆడటానికి సిద్ధంగా ఉన్నా’ అని శ్రీశాంత్‌ తెలిపాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగితే చాలా మంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చన్న శ్రీశాంత్‌.. అప్పుడు మరింతమంది భారత ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందన్నాడు. అలా జరిగితే తనకు కూడా చాన్స్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ అరంగేట్రంలోనే ముంబై ఇండియన్స్‌కు శ్రీశాంత్‌ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top