అవకాశాన్ని అందుకుంటారా! | Depleted India look to tick boxes in Zimbabwe | Sakshi
Sakshi News home page

అవకాశాన్ని అందుకుంటారా!

Jul 10 2015 12:25 AM | Updated on Sep 3 2017 5:11 AM

అవకాశాన్ని  అందుకుంటారా!

అవకాశాన్ని అందుకుంటారా!

జింబాబ్వే జట్టును ‘లైట్’ తీసుకుంటే బంగ్లాదేశ్‌లో ఎదురైన పరాభవమే పునరావృతమవుతుంది. ఎందుకంటే ఆ జట్టు బలంగా ఉంది.

లైవ్
 మ. గం. 12. 30నుంచి
 టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 ఉత్సాహంగా భారత కుర్రాళ్లు
 నేడు జింబాబ్వేతో తొలి వన్డే
 
 బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌కు బలమైన రిజర్వ్ బెంచ్ అవసరం కనిపించింది. దీనికితోడు సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి అడగటంతో జింబాబ్వే పర్యటనకు భారత్ చాలా కొత్త మొహాలతో వెళ్లింది.
 
 కాబట్టి ఈ సిరీస్‌లో వచ్చే అవకాశాలను కుర్రాళ్లు ఎలా నియోగించుకుంటారు..? ఎవరైనా భారత రెగ్యులర్ జట్టులోకి రాగల క్రికెటర్ ఉన్నాడా..? కెప్టెన్‌గా రహానే సామర్థ్యం ఏమిటి..? అందివచ్చిన అవకాశాలని కొత్తవాళ్లు అందుకుంటారా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ద్వారా సమాధానం దొరకాల్సి ఉంది.

 
 హరారే: జింబాబ్వే జట్టును ‘లైట్’ తీసుకుంటే బంగ్లాదేశ్‌లో ఎదురైన పరాభవమే పునరావృతమవుతుంది. ఎందుకంటే ఆ జట్టు బలంగా ఉంది. ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను దాదాపుగా గెలిచినంత పని చేసిన ఈ ఆఫ్రికా జట్టు... ఇటీవల పాకిస్తాన్‌కు ముచ్చెమటలు పట్టించింది. ప్రస్తుతం ఉన్న భారత జట్టుతో పోలిస్తే జింబాబ్వే క్రికెటర్లకు రెట్టింపు అంతర్జాతీయ అనుభవం ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో శుక్రవారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగే తొలి వన్డేలో భారత్ నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాల్సిందే.
 
 భారత్, జింబాబ్వే మధ్య 57 వన్డేలు జరగ్గా... భారత్ 45, జింబాబ్వే 10 గెలిచాయి. మరో 2 ‘టై’గా ముగిశాయి.
 
 తుది జట్టులో ఎవరో..?
 దాదాపు జట్టులోని అన్ని స్థానాల్లో కొత్త ఆటగాళ్లు వస్తున్నారు కాబట్టి కూర్పు రహానేకు కష్టం కాకపోవచ్చు. బంగ్లాదేశ్‌తో చివరి రెండు వన్డేల్లో చోటు లభించని రహానే, ఇప్పుడు బ్యాట్స్‌మన్‌గా కూడా తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాయుడు, భువనేశ్వర్‌లాంటి రెగ్యులర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో సీనియర్లుగా కనిపిస్తున్నారు. టెస్టు జట్టు ఓపెనర్ విజయ్‌తో పాటు ఏడాది తర్వాత మనోజ్ తివారికి మరో అవకాశం దక్కవచ్చు. మిడిలార్డర్‌లో మనీశ్ పాండే అంతర్జాతీయ అరంగేట్రం ఖాయం కాగా, కీపర్ బాధ్యతలు ఉతప్ప నిర్వర్తిస్తాడు.
 

భువీతో పాటు ధావల్ జట్టులో ఉంటాడు. సీనియర్ ఆటగాడు హర్భజన్ తుది జట్టులో ఉండటం ఖాయం కాబట్టి రెండో స్పిన్నర్‌గా అక్షర్‌ను ఆడిస్తారా లేక మూడో పేసర్‌గా మోహిత్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. 30 ఏళ్ల వయసులో జట్టులో చోటు దక్కించుకున్న స్టువర్ట్ బిన్నీ ఏడాది కాలంగా తన ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లోనైనా అతను రాణిస్తే భవిష్యత్తు బాగుంటుంది.
 
 సమష్టితత్వంతో...
డేవ్ వాట్‌మోర్ కోచ్‌గా వచ్చిన తర్వాత జింబాబ్వే జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాక్‌తో సిరీస్‌లో సెంచరీలు చేసిన చిగుంబురా, రజా సొంతగడ్డపై ఆ జట్టు బ్యాటింగ్ భారం మోస్తుండగా... మసకద్జా, విలియమ్స్ కూడా కీలకం కానున్నారు. ప్రధాన బ్యాట్స్‌మన్ ఇర్విన్, పేసర్ చటారా గాయాలతో దూరం కావడం ఆ జట్టును కాస్త బలహీనపర్చింది. అయితే పన్యగర, విటోరి పేస్ బాధ్యతలు నిర్వర్తించనుండగా... ఉత్సెయ, క్రిమర్ రూపంలో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. జట్టులో  9 మంది బౌలర్లు ఉన్నారంటూ కోచ్ ప్రకటించుకోవడం విశేషం.  
 
 జట్లు (అంచనా)
 భారత్: రహానే (కెప్టెన్), విజయ్, తివారి, రాయుడు, పాండే, ఉతప్ప, బిన్నీ, అక్షర్/మోహిత్, హర్భజన్, భువనేశ్వర్, ధావల్.
 
 జింబాబ్వే: చిగుంబుర (కెప్టెన్), సిబాందా, చిబాబా, మసకద్జా, విలియమ్స్, రజా, రిచ్‌మండ్, ఉత్సెయ, క్రిమర్, పన్యగర, విటోరి.
 
 ఇటీవల పాక్‌తో సిరీస్‌లో జింబాబ్వే బాగా ఆడింది. వారిని తక్కువగా అంచనా వేయడం లేదు. మా సామర్థ్యానికి తగినట్లుగా ఆడి విజయం సాధిస్తాం. కుర్రాళ్లు తమను తాము నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం.  కెప్టెన్‌గా నాకంటూ కొన్ని కొత్త ఆలోచనలు, శైలి ఉన్నాయి. అయితే ఈ విషయంలో ధోని భాయ్‌నుంచి ఎంతో నేర్చుకున్నాను.
 -రహానే, భారత కెప్టెన్
 
మా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గెలిస్తే భారత్ ద్వితీయ శ్రేణి జట్టంటారు. ఓడితే దీంతోనే గెలవలేకపోయామంటారు. అయితే మా జట్టు బలంగా ఉందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. సిరీస్ గెలవడమే లక్ష్యం.
 -వాట్‌మోర్, జింబాబ్వే కోచ్
 
 పిచ్, వాతావరణం
 సాధారణంగా ఈ సీజన్‌లో జింబాబ్వేలో పిచ్‌లు పొడిగా ఉండి నెమ్మదిగా స్పందిస్తాయి. టర్న్ మరీ ఎక్కువ లభించకపోయినా తక్కువ స్కోర్లకు కట్టడి చేయడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారు. మ్యాచ్ మొదటి గంట మాత్రం పేస్‌కు అనుకూలిస్తుంది.
 
 కొత్త వన్డే నిబంధనలతో బరిలోకి
 ఐసీసీ ప్రతిపాదించిన కొత్త వన్డే నిబంధనలు భారత్, జింబాబ్వే తొలి వన్డేతోనే అమల్లోకి రానున్నాయి. తొలి 10 ఓవర్లలో క్యాచింగ్ స్థానాల్లో తప్పనిసరిగా ఫీల్డర్లు ఉండటం, బ్యాటింగ్ పవర్‌ప్లే రద్దు, ఆఖరి 10 ఓవర్లలో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు, అన్ని నో బాల్‌లకు ఫ్రీ హిట్ తదితర నిబంధనలతో తొలి వన్డే జరగనుంది.
 
పిచ్, వాతావరణం
 సాధారణంగా ఈ సీజన్‌లో జింబాబ్వేలో పిచ్‌లు పొడిగా ఉండి నెమ్మదిగా స్పందిస్తాయి. టర్న్ మరీ ఎక్కువ లభించకపోయినా తక్కువ స్కోర్లకు కట్టడి చేయడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారు. మ్యాచ్ మొదటి గంట మాత్రం పేస్‌కు అనుకూలిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement