కింగ్స్‌ పంజాబ్‌ లక్ష్యం 167 | Delhi Daredevils set target of 167 runs | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ పంజాబ్‌ లక్ష్యం 167

Apr 8 2018 5:54 PM | Updated on Apr 8 2018 5:54 PM

Delhi Daredevils set target of 167 runs - Sakshi

మొహాలీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న  మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్‌ గౌతం గంభీర్‌(55;42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా, రిషబ్‌ పంత్‌(28;13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌), క్రిస్‌ మోరిస్‌(27 నాటౌట్‌; 16 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌)లు మోస‍్తరుగా ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కోలిన్‌ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు. జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై శ్రేయస్‌ అయ్యర్‌(11), విజయ్‌ శంకర్‌(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్‌ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.  36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇది గంభీర్‌కు 36వ ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ.

కాగా, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా గంభీర్‌(55) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనవసరపరుగు కోసం యత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు. అంతకుముందు రిషబ్‌ పంత్‌(28) దాటిగా ఆడే క్రమంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మోరిస్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ తలో రెండు వికెట్లు సాధించగా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌కు చెరో వికెట్‌ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement