దెబ్బకొట్టిన ఆల్‌రౌండ్‌ వైఫల్యం 

De Kock leads South Africa to nine-wicket win - Sakshi

అజేయ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాను గెలిపించిన కెప్టెన్‌ డికాక్‌

మూడో టి20లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి

దెబ్బకొట్టిన ఆల్‌రౌండ్‌ వైఫల్యం   సిరీస్‌ 1–1తో సమం  

అనుభవం లేని ఆటగాళ్లతో ఏం చేస్తుందిలే అనుకున్న దక్షిణాఫ్రికా అనూహ్యంగా విజృంభించింది. ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో టీమిండియాను ఓడించింది. ప్రారంభంలో ఆధిపత్యం చూపినా దానిని నిలబెట్టుకోలేకపోయిన కోహ్లి సేన ప్రత్యర్ధికి తేలిగ్గా తలొంచింది. వెరసి... మూడో టి20లో సఫారీ జట్టు జయకేతనం ఎగురవేసింది. సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది.

బెంగళూరు: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా మీద తొలిసారి టి20 సిరీస్‌ నెగ్గాలన్న టీమిండియా కోరిక నెరవేరలేదు. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో టి20లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన కోహ్లి సేన... సఫారీల చేతిలో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్, ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (52 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగి ఆడి సఫారీ జట్టును గెలిపించాడు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌.

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (20 బంతుల్లో 19; ఫోర్, సిక్స్‌), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (17 బంతుల్లో 19; ఫోర్, సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. రబడ (3/39) మూడు వికెట్లు పడగొట్టగా, పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఫార్చూన్‌ (2/19), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బ్యురాన్‌ హెన్‌డ్రిక్స్‌ (2/14)కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో దక్షిణాఫ్రికాను డికాక్‌ ఒంటిచేత్తో నడిపించాడు. అతడి దూకుడైన బ్యాటింగ్‌తో ఆ జట్టు ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. డికాక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ అక్టోబరు 2న విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది.

ఎంతో చేస్తుందనుకుంటే!
54/1... పవర్‌ ప్లే (6 ఓవర్లు) అనంతరం భారత్‌ స్కోరిది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9) విఫలమైనా, దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రభావవంతంగా లేకపోవడం, ధావన్, కోహ్లి (9) క్రీజులో ఉండటంతో భారీ స్కోరు ఖాయంగా కనిపించింది. కానీ, టీమిండియా ఒక్కసారిగా తడబడింది. షమ్సీ బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాది మంచి టచ్‌లో కనిపించిన ధావన్‌... అతడి మరుసటి ఓవర్లో ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. ఆ వెంటనే రబడ బౌలింగ్‌లో ఫుల్‌ లెంగ్త్‌ బంతిని గాల్లోకి లేపిన కోహ్లి బౌండరీ లైన్‌ వద్ద ఫెలూక్వాయో పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు.

నాలుగో స్థానంలో పంత్‌ ప్రయోగం మరోసారి ఫలించలేదు. ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో చక్కటి సిక్స్‌ కొట్టిన పంత్‌ను ఫార్చూన్‌ తెలివిగా బోల్తా కొట్టించాడు. రెండు బంతుల తేడాతో క్రీజు వదిలి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (5) స్టంపౌటయ్యాడు. దీంతో 13 ఓవర్లకు జట్టు 92/5తో కష్టాల్లో పడింది. కృనాల్‌ (4) కూడా ఔటయ్యాక హార్దిక్‌ (18 బంతుల్లో 14; ఫోర్‌), జడేజా తమవంతు పోరాటం సాగించారు. ఏడో వికెట్‌కు 29 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో జడేజా, సుందర్‌ (4), హార్దిక్‌లను రబడ పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌ సాధారణ స్కోరుతోనే సరిపెట్టుకుంది.

డికాక్‌ దున్నేశాడు....
అసలే స్వల్ప లక్ష్యం. ఆపై ఛేదనకు అనువైన పిచ్‌. దీంతో డికాక్, మరో ఓపెనర్‌ రీజా హెన్‌డ్రిక్స్‌ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) చెత్త బంతులనే షాట్లు కొడుతూ పోయారు. సైనీ ఓవర్లో రెండు సిక్స్‌లతో ఊపులోకి వచ్చిన సఫారీ కెప్టెన్‌ ఎక్కడా తగ్గకుండా ఆడాడు. ఏ బౌలర్‌ను వదలను అన్నట్లుగా బౌండరీలు, సిక్స్‌లు బాదాడు. 38 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. హెన్‌డ్రిక్స్‌ను హార్దిక్‌ ఔట్‌ చేసినా అప్పటికే ఆలస్యమైంది. డికాక్‌ ధాటితో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ఛేదనలో ఇబ్బంది పడలేదు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బవుమా (23 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ చేయి వేయడంతో సఫారీలు లక్ష్యాన్ని అవలీలగా అందుకున్నారు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) బవుమా (బి) షమ్సీ 36; రోహిత్‌ (సి) రీజా హెన్‌డ్రిక్స్‌ (బి) బ్యురన్‌ హెన్‌డ్రిక్స్‌ 9; కోహ్లి (సి) ఫెలూక్వాయో (బి) రబడ 9; పంత్‌ (సి) ఫెలూక్వాయో (బి) ఫార్చూన్‌ 19; అయ్యర్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) ఫార్చూన్‌ 5; హార్దిక్‌ పాండ్యా (సి) మిల్లర్‌ (బి) రబడ 14; కృనాల్‌ పాండ్యా (సి) డికాక్‌ (బి) బ్యురన్‌ హెన్‌డ్రిక్స్‌ 4; జడేజా (సి అండ్‌ బి) రబడ 19; సుందర్‌ (రనౌట్‌) 4; చహర్‌ (నాటౌట్‌) 0; సైనీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134

వికెట్ల పతనం: 1–22, 2–63, 3–68, 4–90, 5–92, 6–98, 7–127, 8–133, 9–133.

బౌలింగ్‌: ఫార్చూన్‌ 3–0–19–2; రబడ 4–0–39–3; బ్యురన్‌ హెన్‌డ్రిక్స్‌ 4–0–14–2; ఫెలూక్వాయో 4–0–28–0; షమ్సీ 4–0–23–1; ప్రిటోరియస్‌ 1–0–8–0.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: రీజా హెన్‌డ్రిక్స్‌ (సి) కోహ్లి (బి) హార్దిక్‌ 28; డికాక్‌ (నాటౌట్‌) 79; బవుమా (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 140

వికెట్ల పతనం: 1–76.

బౌలింగ్‌: సుందర్‌ 4–0–27–0; దీపక్‌ చహర్‌ 3–0–15–0; సైనీ 2–0–25–0; కృనాల్‌ 3.5–0–40–0; హార్దిక్‌ 2–0–23–1; జడేజా 2–0–8–0.  

పంత్‌... అంతేనా! అంతేనా!
యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మళ్లీ నిరాశపర్చాడు. ఫామ్‌ లేమి, వైఫల్యాలు ఆటగాళ్లకు సహజమే అయినా అందరూ ప్రత్యేక దృష్టితో చూస్తున్నందున మూడో టి20లో పంత్‌ది తప్పక రాణించాల్సిన పరిస్థితి. మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌కు దిగినప్పటికి (7.3వ ఓవర్‌) అంతా సవ్యంగా ఉంది. ఓ మెరుపు ఇన్నింగ్స్‌తో విమర్శలకు సమాధానం ఇచ్చే ఇలాంటి అవకాశాన్ని పంత్‌  సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆఫ్‌ స్టంప్‌నకు దూరంగా బౌలర్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డాడు. ఎప్పటిలాగే ప్రతాపం చూపబోయి వికెట్‌ ఇచ్చేశాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top