చెరొకటి గెలిచారు | Davis Cup: India, Canada locked 1-1 after Ramkumar win | Sakshi
Sakshi News home page

చెరొకటి గెలిచారు

Sep 17 2017 1:19 AM | Updated on Sep 19 2017 4:39 PM

చెరొకటి గెలిచారు

చెరొకటి గెలిచారు

డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే–ఆఫ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో యువ సత్తా ఆకట్టుకుంది. తొలిరోజు ఆటతీరుతో ఆసక్తిని పెంచింది.

భారత్, కెనడా 1–1తో సమం
► రామ్‌ కుమార్‌ విజయం
► పోరాడి ఓడిన యూకీ బాంబ్రీ
► డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌  


ఎడ్మాంటన్‌ (కెనడా): డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే–ఆఫ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో యువ సత్తా ఆకట్టుకుంది. తొలిరోజు ఆటతీరుతో ఆసక్తిని పెంచింది. చెరో విజయంతో భారత్, కెనడా జట్లు 1–1తో సమవుజ్జీగా నిలిచాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పోరులో యూకీ బాంబ్రీ పరాజయం చవిచూడగా, రామ్‌కుమార్‌ రామనాథన్‌ విజయం సాధించాడు. రెండో  సింగిల్స్‌లో యూకీ 6–7 (2/7), 4–6, 7–6 (8/6), 6–4, 1–6తో ప్రపంచ 51 ర్యాంకర్‌ డెనిస్‌ షపొవలోవ్‌ చేతిలో పోరాడి ఓడాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ నిరాశ చెందని యూకీ బాంబ్రీ... స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు.

ఐదు సెట్లదాకా సాగిన ఈ ఆసక్తికర మ్యాచ్‌లో ప్రపంచ 157వ ర్యాంకర్‌ అయిన భారత ఆటగాడు మూడు, నాలుగు సెట్లలో తనకన్నా ఎంతో మెరుగైన ర్యాంకింగ్‌ ఆటగాడిని వణికించాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్‌లో అప్పటికే అలసిపోయిన యూకీ పరాజయం చవిచూడటంతో భారత్‌కు ఓటమి ఎదురైంది. ఫలితాన్ని పక్కనబెడితే నాలుగు గంటల పాటు (3 గం.52 ని.) జరిగిన ఈ పోరులో యూకీ పోరాటం అద్వితీయం. స్పెయిన్‌ స్టార్‌ నాదల్‌నే (మాంట్రియల్‌ మాస్టర్స్‌లో) మట్టికరిపించిన కెనడా యువ సంచలనానికి ముచ్చెమటలు పట్టించాడు. విజయం కోసం తుదికంటా పోరాడాడు. అంతకుముందు తొలి సింగిల్స్‌ బరిలోకి దిగిన 154వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 5–7, 7–6 (7/4), 7–5, 7–5తో బ్రెడెన్‌ ష్నర్‌పై విజయం సాధించాడు.

తొలి సెట్‌లో ఓడిన భారత ఆటగాడు తర్వాత ఒక్కో సెట్‌ విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. 3 గంటల 16 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో వరుసగా  మూడు సెట్లు గెలిచి భారత్‌కు శుభారంభమిచ్చాడు. తొలి రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శనపై నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘కుర్రాళ్ల పోరాటం అద్భుతం. ఓటమి కోరల్లోంచి మ్యాచ్‌ను రామ్‌నాథన్‌ తన చేతుల్లోకి తెచ్చుకున్న తీరు అసాధారణం. యూకీ కూడా అదే పని చేశాడు. ఇందులో ఫలితమే తేడా. పోరాటం ఇంచుమించు ఒకటే’ అని భూపతి అన్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement