‘నల్లవారిని’ నిరోధించేందుకే...

Darren Sammy Comments About Bouncer Rules - Sakshi

బౌన్సర్‌ నిబంధన తెచ్చారన్న స్యామీ 

సెయింట్‌ లూసియా: ప్రపంచ క్రికెట్‌లో నల్లజాతి ఫాస్ట్‌ బౌలర్లు తమ వేగంతో చెలరేగిపోతున్న సమయంలో వారిని అడ్డుకునేందుకే బౌన్సర్ల నిబంధనలో మార్పులు తెచ్చారని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ స్యామీ వ్యాఖ్యానించాడు. ఇతర దేశాల పేసర్లు బౌన్సర్లు వేసినా ఎవరూ పట్టించుకోలేదని, నల్లవారిని మాత్రం కట్టి పడేశారని అతను పరోక్షంగా తమ విండీస్‌ జట్టు గురించి అన్నాడు. ప్రపంచ క్రికెట్‌పై వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్ల ప్రభావం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలపాటు వారు తమ భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థులను పడగొట్టి ఆటపై ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే 90ల్లోకి వచ్చిన తర్వాత విండీస్‌ జోరు తగ్గింది.

‘ఒక ఓవర్‌కు ఒక బౌన్సర్‌ మాత్రమే’ అనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) 1991లో తీసుకొచ్చింది. యాదృచ్ఛికం కావచ్చు కానీ అప్పటినుంచే విండీస్‌ క్రికెట్‌ పతనం ప్రారంభమైంది. ‘ఫైర్‌ ఇన్‌ బేబీలాన్‌ డాక్యుమెంటరీని చూడండి. జెఫ్‌ థాంప్సన్, డెన్నిస్‌ లిల్లీ తదితరులంతా కూడా బౌన్సర్లతో చెలరేగిపోయారు. అమిత వేగంతో బౌలింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ శరీరంపై దాడి చేశారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. అయితే ఆ తర్వాత నల్లవారి జట్టు అదే తరహా దూకుడైన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై చెలరేగింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అప్పుడే బౌన్సర్ల గురించి వారికి ఈ తరహా ఆలోచన వచ్చి ఉంటుంది. నల్ల జట్టును కట్టడి చేయాలనే కొత్త నిబంధన తెచ్చి ఉంటారు. నేను చెప్పేది పూర్తిగా నిజం కాకపోవచ్చు గానీ నాకు మాత్రం అలాగే అనిపించింది’ అని స్యామీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top