
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ఆమె భారత బృందానికి పతాకధారిగా (ఫ్లాగ్ బేరర్) వ్యవహరించనుంది. ఏప్రిల్ 4న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సింధు త్రివర్ణ పతాకం చేతబూని భారత క్రీడాకారులను ముందుకు నడిపించనుందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) శనివారం ప్రకటించింది.
భారత్‌కే చెందిన మరో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా... 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన 22 ఏళ్ల సింధువైపే ఐఓఏ మొగ్గు చూపింది. గత మూడు కామన్‌వెల్త్ గేమ్స్‌లో షూటర్లే భారత బృందాలకు పతాకధారులగా వ్యవహరించడం గమనా ర్హం. 2006 మెల్‌బోర్న్ గేమ్స్‌లో రాజ్యవర్ధన్ రాథోడ్... 2010 ఢిల్లీ గేమ్స్‌లో అభినవ్ బింద్రా... 2014 గ్లాస్గో గేమ్స్‌లో విజయ్ కుమార్ ఫ్లాగ్ బేరర్‌లుగా పాల్గొన్నారు.