చైనా చిందేసింది | China Women Hockey Team Wins Against Belgium Women Hockey Team | Sakshi
Sakshi News home page

చైనా చిందేసింది

Oct 27 2019 3:30 AM | Updated on Oct 27 2019 3:30 AM

China Women Hockey Team Wins Against Belgium Women Hockey Team - Sakshi

చాంగ్‌జౌ: ఓటమి అంచుల నుంచి గట్టెక్కి విజయం రుచి చూస్తూ చైనా మహిళల హాకీ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. బెల్జియంతో శనివారం జరిగిన ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో చైనా విజయం సాధించి ఈ ఘనత సాధించింది. తొలి మ్యాచ్‌లో చైనా 0–2తో ఓడిపోయింది. అయితే రెండో మ్యాచ్‌ను ఆ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా... చైనా అద్భుతం చేసింది. 56వ, 57వ నిమిషాల్లో ఒక్కో గోల్‌ చేసి స్కోరును సమం చేసింది. మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. దాంతో నిర్ణీత రెండు మ్యాచ్‌ల తర్వాత గోల్స్‌ సగటులో చైనా, బెల్జియం 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్‌లో రెండు జట్లు ఐదేసి షాట్‌లు తీసుకున్నా... ఇక్కడా స్కోరు 1–1తో సమమైంది. దాంతో సడెన్‌డెత్‌ నిర్వహించారు. సడెన్‌డెత్‌లో తొలి షాట్‌ను చైనా క్రీడాకారిణి లీ జియాకి బంతిని లక్ష్యానికి చేర్చగా... బెల్జియం క్రీడాకారిణి అలిక్స్‌ జెనీర్స్‌ కొట్టిన షాట్‌ బయటకు వెళ్లిపోవడంతో చైనా 2–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. వరుసగా ఆరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి సంబరాల్లో మునిగి తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement