
విరాట్ సేన విఫలమైందా?
(డీఆర్ఎస్)కు భారత క్రికెట్ కంట్రోలో బోర్డు(బీసీసీఐ) సుముఖత వ్యక్తం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మన జట్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుందా?అంటే కాదనే ప్రశ్నే వినిపిస్తోంది.
రాజ్కోట్: ఇంగ్లండ్తో సుదీర్ఘ ఐదు టెస్టుల సిరీస్కు ముందు అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)కు భారత క్రికెట్ కంట్రోలో బోర్డు(బీసీసీఐ) సుముఖత వ్యక్తం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మన జట్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుందా?అంటే కాదనే వాదన వినిపిస్తోంది. ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా రెండో ఇన్నింగ్స్లో భారత క్రికెట్ జట్టు చేసిన రెండు తప్పిదాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆడేటప్పుడు అలెస్టర్ కుక్ ఆడిన ఒక బంతి బ్యాట్ ను తాకి చేతులో పడినట్లు భావించిన భారత వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా అప్లై చేశాడు. అయితే ఈ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దీనిపై డీఆర్ఎస్కు వెళ్లాలని భావించిన సాహా.. ఆ విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లికి చెప్పాడు. సాహా సూచనను పాటించిన కోహ్లి డీఆర్ఎస్కు వెళ్లాడు. ఆ బంతి అసలు బ్యాట్ కు తాకకపోవడం ఒకటైతే, చాలా దూరం నుంచి వెళ్లుతున్నట్లు రిప్లేలో కనిపించింది. దాంతో భారత్ ఆ రివ్యూలో విఫలమైంది. ఇక్కడ ప్రధానంగా డీఆర్ఎస్కు వెళ్లాలా?లేదా?అనేది వికెట్ కీపర్, బౌలర్, అవతలి ఎండ్ లో ఉన్న బ్యాట్స్మన్పై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. బంతి పిచ్ అయిన మరుక్షణమే ఆ గమనాన్ని అంచనా వేసేది ఈ ముగ్గురే. మరి బ్యాట్ నే తాకని బంతిని క్యాచ్ కోసం వికెట్ కీపర్ ఎలా అప్లై చేశాడనేది తొలి ప్రశ్న. అంటే ఆ బంతిని పూర్తిగా చూడకుండానే మన సాహా రివ్యూకు సిద్ధమైన విషయం బోధపడుతుంది.
ఇదిలా ఉంచితే, 310 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు చేసిన మరొక తప్పిదం కూడా డీఆర్ఎస్ వినియోగంపై విమర్శలకు దారి తీస్తుంది. భారత ఆటగాడు చటేశ్వర పూజారా అవుటైన సందర్బంలో డీఆర్ఎస్ను మన జట్టు కోరలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ రషీద్ వేసిన బౌలింగ్లో పూజారా ఎల్బీగా వెనుదిరిగాడు. పూజారా ఎల్బీ విషయంలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో కట్టుబడి పెవిలియన్ చేరాడు. అయితే క్రీజ్ను విడిచే వెళ్లే సమయంలో డీఆర్ఎస్ను పూజారా మరచినట్లు కనిపించాడు. అవతలి ఎండ్ లో ఉన్న మురళీ విజయ్ను కనీసం సంప్రదించలేదు. ఈ విషయంపై విజయ్ కూడా రివ్యూకు వెళ్లమని పూజారాకు చెప్పలేదు. అయితే పూజారా ఎల్బీగా అవుటైన బంతి పిచ్ అయిన తరువాత లెగ్ స్టంప్ బయటకు వెళుతున్నట్లు స్పష్టంగా కనబడింది. అంటే పూజారా అవుట్ కాలేదని విషయం రిప్లేలో కనబడింది.
కాగా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జట్టులో ఒక కీలక ఆటగాడు ఉన్న అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోపోతే ఫలితం ఇలానే ఉంటుందనేది తరువాత టీమిండియాకు అర్ధమైంది. ఒకవేళ మ్యాచ్ భారత్ ఓడిపోయి ఉంటే విమర్శల దాడి తీవ్రంగానే ఉండేది. పూజారా రెండో వికెట్ గా అవుటైన తరువాత భారత్ తడబడింది. వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. అయితే విరాట్ కోహ్లి, రవి చంద్రన్ అశ్విన్, జడేజాలు రాణించడంతో భారత జట్టు ఓటమి నుంచి తృటిలో తప్పించుకుని బయటపడింది. అడగాల్సిన చోట అడగకుండా, అవసరం లేని చోట డీఆర్ఎస్పై విరాట్ సేన ముందుకు వెళ్లడం ద్వారా అనుభవలేమి కనబడింది.
ఇంకా మెరుగుపడాలి:కోహ్లి
డీఆర్ఎస్పై తాము ఇంకా మెరుగపడాలని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. నాన్-స్ట్రైకర్లో ఉన్న బ్యాట్స్మన్ దీనిపై ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నాడు. అసలు బంతి ఎంతవరకూ స్టంప్స్ పైకి వెళుతుందనేది నాన్ స్టైకర్ ఎండ్లో ఉన్న ఆటగాడు దాదాపు అంచానా వేయాల్సి ఉందన్నాడు. అయితేస్టంప్స్ కు కాస్త దూరంగా వెళుతున్న బంతిని అంచనా వేయడం చాలా కష్టమన్నాడు. ప్రత్యేకంగా ఎల్బీల విషయంలో క్రీజ్ ను ముందుగానే వదిలి వెళ్లకుండా అవతలి ఆటగాడి సాయం తీసుకోవాలని కోహ్లి పేర్కొన్నాడు.