‘ఐ యామ్‌ బ్యాడ్మింటన్‌’ అంబాసిడర్‌గా సింధు

BWF names PV Sindhu as an ambassador for awareness campaign - Sakshi

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రకటన

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమం ‘ఐ యామ్‌ బ్యాడ్మింటన్‌’కు వరల్డ్‌ చాంపియన్, హైదరాబాద్‌ అమ్మాయి పీవీ సింధు అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్‌ బుధవారం ప్రకటించింది. నిజాయితీగా ఆడటం ద్వారా ఆట పట్ల తమకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఆటగాళ్లు వ్యక్తం చేసేందుకు ఈ ప్రచార కార్యక్రమం వేదికగా నిలువనుంది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ‘ఏ క్రీడలోనైనా నిజాయితీగా ఆడటమనేది చాలా ముఖ్యం.

నీ ఇçష్టప్రకారమే నువ్వు ఆటను ఎంచుకున్నావు. దాన్ని ఆడటంలో నువ్వు అమితమైన ఆనందాన్ని పొందాలి. ఆటలో నిజాయితీగా ఉండాలి. అదే నాకు ముఖ్యం. అంబాసిడర్లుగా ఈ విషయాన్ని మేం మరింత బాగా ఆటగాళ్లలోకి తీసుకెళ్లాలి. ఇలా అయితేనే ఈ విషయం ఎక్కువ మంది ఆటగాళ్లకు చేరుతుంది’ అని 24 ఏళ్ల సింధు పేర్కొంది. ఈ ప్రచార కార్యక్రమానికి సింధుతో పాటు మిచెల్లీ లీ (కెనడా), జెంగ్‌ సీ వీయ్, హంగ్‌ యా కియాంగ్‌ (చైనా), జాక్‌ షెఫర్డ్‌ (ఇంగ్లండ్‌), వలెస్కా ఖోబ్‌లాచ్‌ (జర్మనీ), చాన్‌ హో యున్‌ (హాంకాంగ్‌), మార్క్‌ జ్విబ్లెర్‌ (జర్మనీ) అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

వీరికన్నా ముందు బీడబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడు పౌల్‌ ఎరిక్‌ హోయర్, బీడబ్ల్యూఎఫ్‌ పారాలింపిక్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ రిచర్డ్‌ పెరోట్, బ్యాడ్మింటన్‌ స్టార్లు సైనా నెహ్వాల్, విక్టర్‌ అక్సెల్‌సన్, హెండ్రా సతియావాన్, క్రిస్టినా పెడెర్సన్, చెన్‌ లాంగ్, మిసాకి మత్సుతోమో, అకయా తకహాషి 2016 నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమష్టి ప్రయత్నం ద్వారా బ్యాడ్మింటన్‌ క్రీడా లోకంలో అవగాహన పెంచడమే కాకుండా ఆట సమగ్రతను కాపాడటంలో ఆటగాళ్లను చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు అని బీడబ్ల్యూఎఫ్‌ పేర్కొంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top