
తేడా లేకపోతే డీఆర్ఎస్ ఎందుకు?
కొన్ని క్రికెట్ దేశాలకే పరిమితమైన అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మరోసారి పెదవి విప్పింది.
కోల్ కతా:కొన్ని క్రికెట్ దేశాలకే పరిమితమైన అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మరోసారి పెదవి విప్పింది. గతంలో ఈ పద్ధతిని వ్యతిరేకించిన బీసీసీఐ.. ఈ విధానంపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కోచ్ అనిల్ కుంబ్లేలు డీఆర్ఎస్పై స్పందించారు. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో దాదాపు 13 టెస్టుల ఆడనున్న నేపథ్యంలో డీఆర్ఎస్ పై యోచించే అవకాశం ఉందని అనురాగ్ తెలిపారు. ఈ విధానంపై తాము సంతృప్తి చెందిన పక్షంలో అందుకు ఎటువంటి అభ్యంతరం ఉండబోదన్నారు. కాకపోతే తాజాగా డీఆర్ఎస్ ఎలా అమలవుతుంది అనే విషయంపై సమాచారం తీసుకున్న తరువాతే ఆ విధానం అమలుపై ఒక నిర్ణయానికి వస్తామని అనురాగ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, కోచ్ కుంబ్లే మాత్రం డీఆర్ఎస్ అమలు కావాలంటే కచ్చితంగా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయంలో ఎంతో కొంత వ్యత్యాసం అనేది ఉండాలన్నాడు. దాదాపు 95 నుంచి 97 వరకూ అంపైర్లు నిర్ణయం ప్రకటించిన తరువాత డీఆర్ఎస్ ద్వారా కూడా అదే ఫలితం వస్తే ఆ రెండింటిలో మనం చూసిన తేడా ఏమిటని ప్రశ్నించాడు. ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే నిర్ణయం కంటే డీఆర్ఎస్ తో వచ్చే నిర్ణయం మరింత మెరుగ్గా ఉన్నప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుందని కుంబ్లే పేర్కొన్నాడు.