15 ఏళ్లకే పతకం కొట్టాడు

Asian Games 2018: Shardul Vihan is 15 & already an Asian Games medallist - Sakshi

ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత టీనేజ్‌ షూటర్‌ శార్దూల్‌ విహాన్‌

‘డబుల్‌ ట్రాప్‌’లో రెండో స్థానం 

క్రికెట్‌లో ‘అప్రాధాన్యత’ను వద్దనుకున్నాడు. బ్యాడ్మింటన్‌లో మనసు పెట్టలేక లేటైపోయాడు. షూటింగ్‌లో మాత్రం కోచ్‌ చెప్పినట్టు విన్నాడు. తుపాకీ అంత లేకపోయినా... తేలిగ్గానే ఎత్తిపట్టుకున్నాడు. అంతే కోచ్‌కు ఆశ్చర్యం, నమ్మకం రెండు కలిగాయి. కాలచక్రం గిర్రున తిరిగాక... ఆ కుర్రాడే ఏషియాడ్‌లో రజతంపై గురిపెట్టాడు. క్రికెట్, బ్యాడ్మింటన్‌ అబ్బని ఆ బాలుడే ఇండోనేసియాలో టీనేజ్‌ సంచలనమయ్యాడు.  అతనే మీరట్‌ షూటర్‌ శార్దూల్‌ విహాన్‌... 

ఆరేళ్లప్పుడు క్రికెట్‌ నేర్చుకునేందుకు వెళ్తే అక్కడ అంతా ‘లాస్ట్‌’ చాన్సే దక్కేది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ చివర్లో అవకాశమిచ్చారు. ఏడాది భరించాక తండ్రి దీపక్‌ విహాన్‌తో నాకొద్దు ఈ క్రికెటన్నాడు చిన్నారి శార్దూల్‌. సర్లేపదా అని బ్యాడ్మింటన్‌ అకాడమీకి తీసుకెళ్తే దూరాభారంతో లేట్‌గా వెళ్లాడు. సమయపాలన ధిక్కరణను సహించని కోచ్‌ మీ వాడికి వేరే ఆటేదో ఆడించండని చెప్పి పంపించాడు. దీంతో ఏడేళ్ల శార్దూల్‌ షూటింగ్‌ రేంజ్‌కెళితే పాలబుగ్గలోడికి ఈ తుపాకీలెందుకని కోచ్‌ వేద్‌పాల్‌ సింగ్‌ వారించాడు. అయిష్టంగా ఏది ఓసారి ఈ గన్‌ ఎత్తు అంటే టక్కున ఎత్తేశాడు శార్దూల్‌. కోచ్‌ కన్నార్పలేదు. ఇక వద్దనలేదు. గురి పెట్టించాడు. పతకానికి తొలి అడుగులు వేయించాడు. 8 ఏళ్ల తర్వాత ఆ కుర్రాడే ఆసియా క్రీడల్లో అదరగొట్టేశాడు. 15 ఏళ్లకే రజతాన్ని మెడలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున ఆసియా క్రీడల చరిత్రలో పిన్న వయస్సులో పతకం గెలిచిన షూటర్‌గా చరిత్రకెక్కాడు.   

పాలెంబాంగ్‌: మళ్లీ భారత యువ ‘గురి’ అదిరింది. ‘పతకం వస్తే పేరు ప్రఖ్యాతులు... పతకం రాకపోతే అనుభవమైనా వస్తుంది’  అనుకుంటున్నారేమోగానీ... ఆసియా క్రీడల్లో మాత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ షూటర్లు మెరిపిస్తున్నారు. మొన్న 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో 16 ఏళ్ల సౌరభ్‌ చౌదరీ ఏకంగా పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా... తాజాగా పురుషుల ‘డబుల్‌ ట్రాప్‌’ ఈవెంట్‌లో 15 ఏళ్ల శార్దూల్‌ విహాన్‌ రజత పతకాన్ని సాధించి ఔరా అనిపించాడు. సౌరభ్, శార్దూల్‌లది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లానే కావడం మరో విశేషం.   సాధారణంగా షాట్‌గన్‌ (ట్రాప్, డబుల్‌ ట్రాప్‌) ఈవెంట్స్‌లో వెటరన్‌ షూటర్లు ఆధిపత్యం చలాయిస్తారు. కానీ గురువారం ఆసియా క్రీడల్లో మాత్రం శార్దూల్‌ విహాన్‌ తనకంటే రెట్టింపు వయస్సున్న షూటర్లకు చెమటలు పట్టించాడు. 20 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో శార్దూల్‌ 141 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతనితోపాటు మరో ఐదుగురు హమద్‌ అలీ అల్‌ మరి (42 ఏళ్లు–ఖతర్‌; 139 పాయింట్లు)...షిన్‌ వున్‌హ్యూ (34 ఏళ్లు–దక్షిణ కొరియా; 138 పాయింట్లు)... లియు అన్‌లాంగ్‌ (38 ఏళ్లు–చైనా; 138 పాయింట్లు).... ఖాలిద్‌ అల్కాబీ (33 ఏళ్లు–యూఏఈ; 137 పాయింట్లు)... సుంగ్‌జీ వాంగ్‌ (27 ఏళ్లు–దక్షిణ కొరియా; 137 పాయింట్లు) ఫైనల్‌కు చేరారు. భారత్‌కే చెందిన మరో షూటర్‌ అంకుర్‌ మిట్టల్‌ 134 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు.  ఫైనల్లోనూ శార్దూల్‌ చెదరని ఏకాగ్రతతో ఆడి 73 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. షిన్‌ వున్‌వ్యూ 74 పాయింట్లతో స్వర్ణాన్ని కైవసం చేసుకోగా... హమద్‌ అలీ 53 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల డబుల్‌ ట్రాప్‌ లో భారత షూటర్లు శ్రేయసి (121 పాయింట్లు) ఆరో స్థానంలో... వర్ష (120 పాయింట్లు) ఏడో స్థానంలో నిలిచారు. పోటీల ఐదో రోజు భార త్‌కు రజతం, రెండు కాంస్యాలు లభించాయి. ప్రస్తుతం భారత్‌ 4 స్వర్ణాలు, 4 రజతాలు, 10 కాంస్యాలతో కలిపి 18 పతకాలతో పదో స్థానంలో ఉంది.

అంకితకు కాంస్యం 
మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అంకిత రైనాకు కాంస్యం లభించింది. సెమీఫైనల్లో అంకిత 4–6, 6–7 (6/8)తో 34వ ర్యాంకర్‌ షుయె జాంగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 6–7 (2/7), 6–4, 7–6 (10/8)తో క్వాన్‌ సూన్‌వూ (దక్షిణ కొరియా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–దివిజ్‌ శరణ్‌ జంట 4–6, 6–3, 10–8తో యుసిగి–షిమాబుకురో (జపాన్‌) జోడీపై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–అంకిత ద్వయం 4–6, 6–1, 6–10తో రుంగ్‌కాట్‌–అల్దిలా(ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.  

స్క్వాష్‌లో పతకం ఖాయం 
పురుషుల స్క్వాష్‌ సింగిల్స్‌ ఈవెంట్‌లో భారత ప్లేయర్‌ సెమీస్‌కు చేరనుండటంతో కనీసం కాంస్యం ఖాయమైంది. సౌరవ్‌ ఘోషాల్, హరీందర్‌ క్వార్టర్‌ ఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో జోష్నా, దీపిక క్వార్టర్స్‌కు చేరారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top