అశ్విన్‌కు 50వ టెస్టు... | Ashwin Grateful for 50th Test Match; Not Looking to Set New Targets | Sakshi
Sakshi News home page

అశ్విన్‌కు 50వ టెస్టు...

Jul 25 2017 12:20 AM | Updated on Sep 5 2017 4:47 PM

అశ్విన్‌కు 50వ టెస్టు...

అశ్విన్‌కు 50వ టెస్టు...

రెండేళ్ల క్రితం గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు ఆడే ముందు అశ్విన్‌ వేరు... ఆ తర్వాత అశ్విన్‌ వేరు.

రెండేళ్ల క్రితం గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు ఆడే ముందు అశ్విన్‌ వేరు... ఆ తర్వాత అశ్విన్‌ వేరు. పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నప్పుడు కొంత రాణిస్తాడనే గుర్తింపు ఉన్నా... అశ్విన్‌కు ఎలాంటి ప్రత్యేకత లేదు. అప్పటి వరకు ఆడిన 25 టెస్టుల్లో అతను 98 వికెట్లు మాత్రమే తీశాడు. భారత్‌ ఆడిన గత 13 టెస్టుల్లో అతడిని 7 మ్యాచ్‌లలో పక్కన పెట్టారు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో జరిగిన టెస్టుల్లో భారత్‌ ఇతర బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టింది. అయితే గాలే టెస్టు అశ్విన్‌ రాతను మార్చింది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆరు వికెట్లు సహా మొత్తం అతను 10 వికెట్లు పడగొట్టాడు. అంతే... ఆ తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌కు ఎదురులేకుండా పోయింది.

తర్వాతి 24 టెస్టుల్లో అతను ఏకంగా 151 వికెట్లు తీశాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్‌ ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకున్నాడు. బుధవారం తన 50వ టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగనున్న అశ్విన్‌ కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నాడు. ‘టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే అవకాశాన్ని నాకు ఆనాడు గాలే టెస్టు ఇచ్చింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టిన రోజుల నుంచి చూస్తే 50 టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నా. ఇకపై ఎన్ని మ్యాచ్‌లు ఆడినా అదంతా అదనంగా లభించే ఆనందమే’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. మంచి రోజులు, చెడ్డ రోజులు క్రికెటర్‌ జీవితంలో భాగమని, అనుభవాలు పాఠాలు నేర్పుతాయన్న అశ్విన్‌... 2015తో పోలిస్తే ఆటగాడిగా తాను ఎంతో మెరుగయ్యానని చెప్పాడు. ఇకపై ఫలానాది సాధించాల్సి ఉందని తాను ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవడం లేదని ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ వ్యాఖ్యానించాడు. భారత జట్టులో తీవ్రమైన పోటీ మధ్య చోటు నిలబెట్టుకోవడమే గొప్ప ఘనతగా అతను అభివర్ణించాడు.

‘నాకు నేను ఎలాంటి మైలురాళ్లు, రికార్డులు లక్ష్యంగా పెట్టుకోరాదని అనుభవం ద్వారా నేర్చుకున్నాను. గత ఘనతలపైనే సాగాలని ప్రయత్నిస్తే క్రికెట్‌ మిమ్మల్ని కింద పడేయడం ఖాయం. దానికంటే ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెట్టి ఆటను మరింత మెరుగుపర్చుకోవడం అవసరం. భారత జట్టులో చోటు దక్కించుకోవడం కంటే నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఇతర జట్లు కొత్త ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తాయి. మన దగ్గర మైదానం బయటినుంచి ఉండే ఒత్తిడి కూడా చాలా ఎక్కువ’ అని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌ 49 టెస్టుల కెరీర్‌లో 25.22 సగటుతో 275 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 25 సార్లు తీయగా...మ్యాచ్‌లో 10 వికెట్లు 7 సార్లు పడగొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement