నీలా ఫిక్సింగ్‌ చేయడం రాదు!  | Sakshi
Sakshi News home page

నీలా ఫిక్సింగ్‌ చేయడం రాదు! 

Published Tue, Feb 20 2018 1:13 AM

Ashwin, Gibbs involved in Twitter spat - Sakshi

చెన్నై: పదునైన వ్యాఖ్యలతో దూస్రాలు సంధించడంలో అశ్విన్‌ తనకు తానే సాటి. తాజాగా అశ్విన్‌ దెబ్బకు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్షల్‌ గిబ్స్‌ విలవిల్లాడాడు! ఏదో జోక్‌ చేయబోయిన అతను అనవసరంగా ఇరుక్కున్నాడు. వివరాల్లోకెళితే... తన కొత్త షూ ప్రత్యేకతలు, పరుగెత్తడంలో ఉండే సౌకర్యం గురించి చెబుతూ అశ్విన్‌ ఒక వీడియో ట్వీట్‌ చేశాడు. వికెట్ల మధ్య, అవుట్‌ ఫీల్డ్‌లో అశ్విన్‌ చురుగ్గా పరుగెత్తలేడనే అంశాన్ని గుర్తు చేసే విధంగా ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత వ్యంగ్యంతో గిబ్స్‌ వ్యాఖ్య వదిలాడు. అయితే దీనిపై వెంటనే స్పందించిన అశ్విన్‌ ‘ఈ విషయంలో నీ అంత అదృష్టవంతుడిని కాదు కాబట్టి నిజంగానే వేగంగా పరుగెత్తలేను మిత్రమా.

అయితే నాకు తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్‌ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం చాలా అదృష్టవంతుడిని’ అని ఘాటుగా జవాబిచ్చాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో గిబ్స్‌ దోషిగా తేలి ఆరు నెలల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. దాంతో షాక్‌కు గురైన గిబ్స్‌... తన జోక్‌ను అశ్విన్‌ తప్పుగా భావించాడని, విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు మరో ట్వీట్‌ చేశాడు. దీనిపై మళ్లీ స్పందించిన అశ్విన్‌... తన ప్రత్యుత్తరం కూడా జోక్‌ మాత్రమే అంటూ, మున్ముందు కలిసి డిన్నర్‌ చేద్దామంటూ పిలిచాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement