
సన్ రైజర్స్ కు మరో ఎదురుదెబ్బ
ఐపీఎల్ తాను ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
బెంగళూరు: ఐపీఎల్-9లో తాను ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్వయంగా వెల్లడించాడు. గజ్జలో గాయం కావడంతో నెహ్రా కొన్ని మ్యాచ్ లు దూరమయ్యాడని తెలిపాడు.
మంగళవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో నెహ్రా గాయపడ్డాడు. దీంతో తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. 2.1 ఓవర్లు వేసి మధ్యలో వైదొలిగాడు. మిగిలిన 5 బంతులను మరో బౌలర్ ఆశిష్ రెడ్డి వేశాడు. హైదరాబాద్ తరపున నెహ్రా తొలిసారిగా ఆడుతున్నాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.