టీ20 చరిత్రలో నయా వరల్డ్‌ రికార్డు | Anjali Chand Creates World Record In T20I History | Sakshi
Sakshi News home page

టీ20 చరిత్రలో నయా వరల్డ్‌ రికార్డు

Dec 2 2019 4:55 PM | Updated on Dec 2 2019 5:24 PM

Anjali Chand Creates World Record In T20I History - Sakshi

పోఖరా(నేపాల్‌): అంతర్జాతీయ టీ20ల్లో మరో నయా రికార్డు లిఖించబడింది. ఆరు వికెట్లు సాధించడమే కాకుండా అసలు పరుగులే ఇవ్వకుండా నేపాల్‌ మహిళా క్రికెటర్‌ అంజలీ చాంద్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సోమవారం మాల్దీవులతో జరిగిన మ్యాచ్‌లో అంజలీ చాంద్‌ ఈ రికార్డును సాధించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన మాల్దీవులు 16 పరుగులకే చాపచుట్టేయగా, నేపాల్‌ బౌలర్‌ అంజలీ చాంద్‌ ఆరు వికెట్లతో చెలరేగిపోయారు. అదే సమయంలో కనీసం ఒక్క పరుగును కూడా ఇవ్వలేదు. దాంతో ఆరు వికెట్లు సాధించడమే కాకుండా పరుగులివ్వని బౌలర్‌గా అంజలీ చాంద్‌ రికార్డు పుస్తకాల్లోకెక్కారు. ఏడో ఓవర్‌లో మూడు వికెట్లు సాధించిన అంజలీ చాంద్‌.. 9 ఓవర్‌లో మరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 11 ఓవర్‌లో వికెట్‌ను తీశారు. 

ఈ మీడియం పేస్‌ బౌలర్‌ కేవలం 2.1 ఓవర్లు మాత్రమే వేసి ఆరు వికెట్లు సాధించడం విశేషం. కాగా, పరుగులు ఇవ్వకపోవడం రికార్డుగా చేరింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టడంతో పురుషుల టీ20 క్రికెట్‌లో రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అనంతరం 17 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ 0.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. దక్షిణాసియా క్రికెట్‌ గేమ్స్‌లో భాగంగా పోఖరాలో నాలుగు జట్లు ఆడుతున్నాయి. నేపాల్‌, మాల్దీవులతో పాటు బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే ఈ మ్యాచ్‌లలో టాప్‌లో నిలిచే రెండు జట్లు గోల్డ్‌ మెడల్‌ కోసం పోటీ పడతాయి. ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న జట్లు కాంస్య పతకం కోసం తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement