హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతోంది

Ambati Rayudu Alleges Corruption In Hyd Cricket Association - Sakshi

జట్టు ఎంపికలో డబ్బు, హోదాలే ప్రమాణం

చర్య తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌కు అంబటి రాయుడు ట్వీట్‌ 

రాయుడు నిస్పృహలో ఉన్న క్రికెటర్‌: అజహర్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)పై పెద్ద పిడుగు పడింది. క్రికెట్‌ సంఘాలపై అవినీతి ఆరోపణలు తరచుగా వార్తల్లో కనిపించేవే. అయితే ఈసారి భారత క్రికెటర్, అత్యంత అనుభవజు్ఞడు, హెచ్‌సీఏను దగ్గరి నుంచి చూసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అంబటి రాయుడు సంఘంలో జరుగుతోన్న అవినీతిని బహిరంగంగా ఎండగట్టాడు. జట్టు ఎంపికలో డబ్బు, హోదా, రాజకీయ ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌)కు ట్వీట్‌ చేశాడు. పలు ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్‌ క్రికెట్‌ను శాసిస్తున్నారంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘కేటీఆర్‌ సర్‌... దయచేసి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రబళిన అవినీతిపై దృష్టి సారించండి.

జట్టు ఎంపికను డబ్బు, అవినీతి పరులు ప్రభావితం చేస్తుంటే హైదరాబాద్‌ క్రికెట్‌ ఎలా అభివృద్ధి చెందుతుంది? వారిపై చర్య తీసుకోండి. ఏసీబీ కేసుల్ని ఎదుర్కొంటోన్న పలువురు హైదరాబాద్‌ క్రికెట్‌ను శాసిస్తున్నారు’ అని రాయుడు ట్వీట్‌లో తీవ్రంగా ఆరోపించాడు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో ఆడలేనంటూ రాయుడు జట్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో బి. సందీప్‌ హైదరాబాద్‌కు సారథ్యం వహించనున్నాడు.  అంబటి రాయుడు ఆరోపణలను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ తేలికగా తీసుకున్నారు. రాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ అతను నిస్పృహలో ఉన్న క్రికెటర్‌ అని అన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top