జొసెఫ్‌ దెబ్బకి సన్‌రైజర్స్‌ ఢమాల్‌

Alzarri Joseph picks up best IPL figures Mumbai win Against Sunrisers - Sakshi

96 పరుగులకే కుప్పకూలిన సన్‌రైజర్స్‌

సన్‌రైజర్స్‌ జోరుకు బ్రేక్‌ వేసిన ముంబై

సన్‌రైజర్స్‌ పతనాన్ని శాసించిన జోసెఫ్‌

ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన విండీస్‌ పేసర్‌

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) అరంగేట్ర మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌ పేసర్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు అల్జారి జోసెఫ్‌ సంచలనం సృష్టించాడు.  జోసెఫ్‌(6/12) దాటికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేక మేడలా కూలిపోయింది. శనివారం స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 17.4 ఓవర్లలో 96 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో సన్‌రైజర్స్‌ విజయాల జోరుకు బ్రేక్‌ పడింది. 

ఛేదనలో సన్‌రైజర్స్‌కు తొలి మూడు ఓవర్లు మాత్రమే ఆనందం కలిగిచింది. బెయిర్‌ స్టో(16)తో వికెట్ల పతనం ప్రారంభమైంది. ఏ ఒక్కరూ కూడా బాధ్యతా యుతంగా ఆడకపోవడం సన్‌రైజర్స్‌ కొంపముంచింది. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే విధ్వంసకర ఆటగాడు వార్నర్‌(15) వికెట్‌ను జోసెఫ్‌ సాధించాడు. అయితే ముంబై ఇండియన్స్‌ ఫీల్డర్లు కొన్న జీవనధారాలు ఇచ్చిన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ సరిగా వినియోగించుకోలేదు. జోసెఫ్‌ తన వెంటవెంట ఓవర్లోనే విజయ్‌ శంకర్‌(5), హుడా(20), రషీద్‌ ఖాన్‌(0), భువనేశ్వర్‌(2), కౌల్‌(0)లు ఔట్‌ చేసి ఆతిథ్య జట్టు నడ్డివిరిచాడు. మరో యువ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌(2/21) కూడా రాణించడంతో ముంబై పని సులువైంది. దీంతో వందో లోపే సన్‌రైజర్స్‌ ఆలౌట్‌ ఘోర ఓటమి చవిచూసింది.

పొలార్డ్‌ మెరుపులు..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ(11) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,సూర్యకుమార్‌ యాదవ్‌(7) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.ఆపై కాసేపటికి కుదురుగా ఆడుతున్నట్లు కనిపించిన డీకాక్‌(19) సైతం పెవిలియన్‌ చేరాడు.

ఇక అటు తర్వాత కృనాల్‌ పాండ్యా(6), ఇషాన్‌ కిషన్‌(17), హార్దిక్‌ పాండ్యా(14), రాహుల్‌ చాహర్‌(10)లు లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో ముంబై 97 పరుగులకే ఏడు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో పొలార్డ్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో అజేయంగా 46 పరుగులు సాధించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. సిద్థార్ధ్‌ కౌల్‌ రెండు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, నబీ, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top