మూడు ‘కాంస్యాల’ స్క్వాష్‌

All three singles squash players settle for bronze medals - Sakshi

సెమీస్‌లో ఓడిన దీపిక, జోష్నా, సౌరవ్‌

జకార్తా: ఆసియా క్రీడల ‘స్క్వాష్‌’లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. ముగ్గురు అగ్రశ్రేణి సింగిల్స్‌ ఆటగాళ్లు సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో కంచుతో సరిపెట్టుకోక తప్పలేదు. అయితే ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2014లో స్క్వాష్‌లో భారత్‌ ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. నాడు రజతం గెలిచిన సౌరవ్‌ ఘోషల్‌ ఈసారి కాంస్యం సాధించగా, దీపిక పల్లికల్‌ మళ్లీ కాంస్యానికే పరిమితమైంది. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో సౌరవ్‌ 12–10, 13–11, 6–11, 6–11, 6–11 స్కోరుతో చున్‌ మింగ్‌ యు (హాంకాంగ్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.

తొలి రెండు సెట్‌లు గెలిచి ముందంజలో నిలిచినా...ఘోషల్‌ చివరి వరకు దానిని కాపాడుకోలేక చేతులెత్తేశాడు. రెండు సెట్‌లు గెలుచుకున్న అనంతరం మూడో సెట్‌లో ఒక దశలో సౌరవ్‌ 6–5తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే చున్‌ మింగ్‌ వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకొని భారత ఆటగాడికి షాక్‌ ఇచ్చాడు. అదే ఊపును అతను తర్వాతి రెండు సెట్లలో కొనసాగించగా, సౌరవ్‌ మాత్రం చతికిల పడ్డాడు. అయితే రెండో సెట్‌ చివర్లో తన కాలికి గాయమైందని, దాంతో ఓటమి తప్పలేదని ఘోషల్‌ వివరణ ఇచ్చాడు.  

మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో మలేసియా దిగ్గజ క్రీడాకారిణి, డిఫెండింగ్‌ చాంపియన్‌ నికోల్‌ డేవిడ్‌ 11–7, 11–9, 11–6 తేడాతో దీపిక పల్లికల్‌ను చిత్తు చేసింది. పదేళ్ల పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌గా స్క్వాష్‌ను శాసించిన నికోల్‌ ముందు దీపిక నిలవలేకపోయింది. మరో సెమీఫైనల్లో శివశంకరి సుబ్రహ్మణ్యం (మలేసియా) 12–10, 11–6, 9–11, 11–7తో జోష్నా చినప్పను ఓడించింది. గత మూడు ఆసియా క్రీడల్లో రిక్తహస్తాలతో తిరిగొచ్చిన జోష్నాకు ఇదే మొదటి పతకం కావడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top