అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవి కోసం తమ అభ్యర్థిగా దిగ్గజ ఆటగాడు జహీర్ అబ్బాస్‌ను పాక్ క్రికెట్ బోర్డు నామినేట్ చేసింది.
ప్రతిపాదించిన పాక్ బోర్డు
కరాచీ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవి కోసం తమ అభ్యర్థిగా దిగ్గజ ఆటగాడు జహీర్ అబ్బాస్‌ను పాక్ క్రికెట్ బోర్డు నామినేట్ చేసింది. పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సేథి తప్పుకోవడంతో అబ్బాస్ పేరును ప్రతిపాదించారు. ఈ పదవి కోసం మాజీ ఆటగాళ్లు మాజిద్ ఖాన్, అసిఫ్ ఇక్బాల్ పేర్లు తెరపైకి వచ్చినా పీసీబీ గవర్నింగ్ బాడీ మాత్రం జహీర్ అబ్బాస్ వైపే మొగ్గు చూపింది. ఆసియా బ్రాడ్‌మన్‌గా పేరు తెచ్చుకున్న అబ్బాస్ 78 టెస్టుల్లో 5062 పరుగులు చేశారు.
ముందుగా అనుకున్న ప్రకారం జూలై 1 నుంచి ఏడాది కాలం నజమ్ సేథి ఈ పదవిని అలంకరించాల్సి ఉంది. అయితే గతేడాది నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా ఆయా దేశాలకు చెందిన ప్రముఖ టెస్టు ఆటగాళ్లనే ప్రతిపాదించాలని ప్రపంచ క్రికెట్ బాడీ ప్రకటించింది. ఈనేపథ్యంలో ముందుగానే సేథి తప్పుకున్నారు.