డివిలియర్స్‌ జట్టుకు స్వర్ణం

AB De Villiers Won The Three Team Cricket Solidarity Cup - Sakshi

3 టీమ్‌ క్రికెట్‌ సాలిడారిటీ కప్‌

సెంచూరియన్‌: విధ్వంసక బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ సారథ్యంలోని జట్టు మిగతా రెండు ప్రత్యర్థి జట్లను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది... క్రికెట్‌లో ఈ తరహా ఫలితం గురించి విని ఆశ్చర్యపోతున్నారా! మీరు చదివింది నిజమే. కరోనా దెబ్బ తర్వాత ఎలాగైనా క్రికెట్‌ను మొదలు పెట్టేందుకు దక్షిణాఫ్రికా బోర్డు తీసుకొచ్చిన కొత్త ఫార్మాట్‌ 3టీమ్‌ క్రికెట్‌ (3టీసీ) సాలిడారిటీ కప్‌ మ్యాచ్‌ ఫలితం ఇది. ‘నెల్సన్‌ మండేలా డే’ అయిన శనివారం ఈ టోర్నీ జరిగింది. డివిలియర్స్‌ నాయకత్వంలో ‘ఈగల్స్‌’, తెంబా బవుమా సారథిగా ఉన్న ‘కైట్స్‌’, రీజా హెన్‌డ్రిక్స్‌ కెప్టెన్సీ చేసిన ‘కింగ్‌ఫిషర్స్‌’ జట్లు బరిలోకి దిగాయి. నిబంధనల ప్రకారం ప్రతీ జట్టులో గరిష్టంగా ఎనిమిది మంది ఆటగాళ్లే ఉంటారు. మూడు జట్లు కలిపి ఒకే సారి 36 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తలపడతాయి.

రెండు భాగాలుగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఒక్కో జట్టు 6 + 6 ఓవర్ల చొప్పున 12 ఓవర్లు ఆడుతుంది. ప్రతీ జట్టు తొలి భాగంలో ఒక ప్రత్యర్థిని, రెండో భాగంలో మరో పత్య్రర్థిని ఎదుర్కొంటుంది. ఫీల్డర్లందరూ బౌండరీ వద్దనే నిలబడతారు. చివరకు ఒక్కో జట్టు చేసిన మొత్తం పరుగులను బట్టి విజేతను నిర్ణయిస్తారు. డివిలియర్స్‌ ‘ఈగల్స్‌’ టీమ్‌ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి స్వర్ణం గెలుచుకుంది. డివిలియర్స్‌ తనదైన శైలిలో చెలరేగి 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 3 వికెట్లకు 138 పరుగులు సాధించిన కైట్స్‌కు రజతం, 5 వికెట్లకు 113 పరుగులు చేసిన కింగ్‌ ఫిషర్స్‌కు కాంస్య లభించాయి. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా (సుమారు 82 వేలు) ఉన్న గాటెంగ్‌ ప్రావిన్స్‌లో ప్రజల కు భరోసా కల్పించే ఉద్దేశంలో అక్కడే మ్యాచ్‌ ను నిర్వహించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top