భారత్‌ ‘బంగారు’ చరిత్ర | 15 year old weightlifter Jeremy Larinnunga wins India’s first ever Youth Olympics gold | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘బంగారు’ చరిత్ర

Oct 9 2018 11:08 AM | Updated on Oct 9 2018 11:26 AM

15 year old weightlifter Jeremy Larinnunga wins India’s first ever Youth Olympics gold - Sakshi

బ్యూనస్‌ ఎయిర్స్‌(అర్జెంటీనా): యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ టీనేజ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ సంచలనం జెరెమీ లాల్రిన్గుంగా స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోరులో 15 ఏళ్ల లాల్రిన్గుంగా ఫైనల్‌ అటెంప్ట్‌లో 150 కేజీల బరువు ఎత్తడంతో పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. గ్రూప్‌-ఎలో భాగంగా 62 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ యువ వెయిట్‌లిఫ్టర్‌.. మొత్తంగా 274 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించాడు. తొలుత స్నాచ్‌ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో అత్యధికంగా 150కేజీలను ఎత్తాడు. దాంతో టర్కీ వెయిట్‌లిఫ్టర్‌ తొప్తాస్‌ కానర్‌(263 కేజీలు)లను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఫలితంగా స్వర్ణం ఖాయమైంది.  కాగా, ఓవరాల్‌ యూత్‌ ఒలింపిక్స్‌లో ఇదే భారత్‌కు తొలి స్వర్ణం కావడం విశేషం. దాంతో యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ‘బంగారు’ చరిత్రను ఆరంభించినట్లయ్యింది.

సోమవారం ఆటల్లో భాగంగా షూటింగ్‌ సంచలనం మేహులి ఘోష్‌ స్వర్ణ గురి తప్పింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో 18 ఏళ్ల మేహులి రజతంతో సరిపెట్టుకుంది. ఆఖరి షాట్‌ మినహా అన్ని షాట్లను లక్ష్యానికి దగ్గరగా గురిపెట్టిన ఆమె చివరి 24వ షాట్‌తో స్వర్ణానికి దూరమైంది. కాగా, భారత్‌ ఖాతాలో తాజాగా స్వర్ణం చేరడంతో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. మూడో యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పసిడి ఖాతాను తేరవడం గమనార్హం. ఇప‍్పటివరకూ ఈ యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక గోల్డ్‌ మెడల్‌తో పాటు మూడు రజత పతకాలు సాధించింది. ఇదే భారత్‌కు యూత్‌ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతకుముందు 2014లో భారత్‌ కేవలం రెండు పతకాల్ని మాత్రమే సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement