అదే నా లక్ష్యం

priya prakash varrier Revealed Her goal - Sakshi

తమిళసినిమా: ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. పేరు మాత్రం దక్షిణాదిని దాటి ఉత్తరాది సినిమాకు పాకేసింది. ఆ పేరే ప్రియా వారియర్‌. కథానాయికలకు చిరునామా కేరళా అన్నట్టుగా పరిస్థితి  మారిపోయింది. అక్కడి అమ్మాయిలిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో హీరోయిన్లుగా దుమ్మురేపుతున్నారు. ఇక ప్రియా వారియర్‌ గురించి చెప్పాలంటే ఈమె కథానాయకిగా పరిచయం అవుతున్న ఒరు అడార్‌ లవ్‌ అనే మలయాళ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఆ చిత్రం ట్రైలర్‌లో ప్రియ నటించిన దృశ్యాలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రియా వారియర్‌ కన్ను కొట్టే దృశ్యం కుర్రకారులో కేక పుట్టిస్తోంది. ఈ సందర్భంగా ఈ క్రేజీ నటి ఏమంటుందో చూద్దాం. ఒరు అడార్‌ లవ్‌ చిత్ర ట్రైలర్‌తోనే నాకు ఒక్క మాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందుకు నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.

గాలిలో తేలిపోతున్నట్లుంది. ఈ సంతోషం భవిష్యత్తులోనూ కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాన్న ఎక్సైజ్‌ శాఖలో పని చేస్తున్నారు. అమ్మ హౌస్‌వైఫ్‌. నేను బీకామ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చదువుకు ఆటంకం కలగకుండా నటిస్తున్నా. ఇప్పుడు మా కళాశాల్లో నేను చాలా పాపులర్‌ అయ్యాను. ఇలా సడన్‌గా పాపులర్‌ కావడం వినూత్న అనుభవం. నేను నటిని కావడం నా తల్లిదండ్రులకు సంతోషమే. తాతా,బామ్మలు ఆనందపడుతున్నారు. నేను పెద్ద నటిని కావాలన్నది వారి కోరిక. ఇంతకుముందు కొన్ని షార్ట్‌ ఫిలింస్‌లో నటించాను. అందాల పోటీల్లోనూ పాల్గొన్నాను. డాన్స్‌ పోటీలో గెలుపొందాను. కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. స్టార్‌ హీరోయిన్‌ కావాలన్నది నా కోరిక. అన్ని భాషల్లోనూ నటించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం.

Read latest South India News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top