ఐశ్వర్యను కించపరుస్తూ వివేక్‌ ఒబెరాయ్‌ ట్వీట్‌.!

Vivek Oberoi Slammed for Sharing Disrespectful Meme on Aishwarya Rai - Sakshi

మండిపడుతున్న ప్రముఖులు, నెటిజన్లు

కేసు నమోదు చేసిన మహారాష్ట్ర మహిళా కమిషన్‌

ముంబై : బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ సరదాగా చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల నేపథ్యంలో ఆయన షేర్‌ చేసిన మీమ్‌ పెడర్థాలకు దారితీసింది. బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ను కించపరిచే విధంగా ఉన్న ఆ మీమ్‌పై యావత్‌ భారతం మండిపడుతోంది. మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఒబెరాయ్‌ ప్రవర్తించాడని దుమ్మెత్తిపోస్తుంది. ఇంతకీ ఒబెరాయ్‌ చేసిన తప్పు ఏంటంటే.. ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్‌ అయిన ఐశ్వర్య వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ.. ఎగతాళిగా రూపొందించిన మీమ్‌ను షేర్‌ చేయడం. ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌ను ప్రస్తావిస్తూ.. చాలా జుగుప్సాకరంగా రూపొందించిన ఆ మీమ్‌ను ట్వీట్‌ చేయడం.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది.

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌తో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఒపీనియన్‌ పోల్‌గా.. తనతో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఎగ్జిట్‌ పోల్‌గా.. అభిషేక్‌ బచ్చన్‌, తన కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య ఉన్న ఫొటోను రిజల్ట్‌గా పేర్కొంటూ ఏ మాత్రం సోయి లేకుండా ట్వీట్‌ చేశాడు. పైగా వెటకారంగా ‘హహహ.. క్రియేటివ్‌.. ఇక్కడ రాజకీయాలు లేవు. జీవితం మాత్రమే’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ ట్వీట్‌ చూసిన ప్రతి ఒక్కరు ఆగ్రహానికి గురవుతున్నారు. ఒబెరాయ్‌ ఒళ్లు మరిచి ట్వీట్‌ చేశాడని మండిపడుతున్నారు.

చాలా అమర్యాదకంగా ప్రవర్తించాడని, వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాలని కామెంట్‌ చేస్తున్నారు. నరేంద్రమోదీ సినిమాలో మోదీ పాత్ర చేసినంత మాత్రానా.. ప్రధానని ఫీలవుతున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. మహిళలను గౌరవించడం నేర్చుకో అంటూ బుద్ది చెబుతున్నారు. బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ సైతం ఒబెరాయ్‌ చర్యను తప్పుబట్టారు. చాలా అసహ్యంగా ఉందని కామెంట్‌ చేశారు. ఈ ట్వీట్‌ నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఒబెరాయ్‌పై కేసు నమోదు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్‌  ‘పీఎం నరేంద్రమోదీ’ లో ఒబెరాయ్‌ మోదీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్‌ వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని బీజేపీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top