హ్యాష్‌ట్యాగ్‌లు..గెలుపు మంత్రాలు !

Social Media Is Becoming Win Mantra For Political Parties - Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ :  ఒకప్పుడు ఎన్నికలంటే నినాదాలే. అవెంత కొత్తగా ఉంటే జనాన్ని అంతగా ఆకర్షించేవి. రోటీ కపడా ఔర్‌ మకాన్‌ అన్నా, సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అన్నా జనంలోకి ఎంత బలంగా వెళ్తే పార్టీకి ఎన్నికల్లో అంతలా ఓట్లు కురిసేవి. ఇప్పుడు కాలం మారింది. ఇవాళ రేపు అందరూ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు.

అందులో ట్రెడ్డింగ్‌లో ఉన్న అంశాలంటే అందరికీ ఎక్కడ లేని ఆసక్తి. అవే హ్యాష్‌ట్యాగ్‌లు. ఆ హ్యాష్‌ట్యాగ్‌ ఎంత క్యాచీగా ఉంటే నెటిజన్లను అంతగా ఆకర్షిస్తుంది. ఎన్నికల నినాదాలకు మించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు కొందరు కన్సల్టెంట్లను కూడా నియమిస్తున్నారు. 

మండే ఎండలతో పోటీ పడేలా
బయట ఎండల వేడి. సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ల హీట్‌. ప్రతీ పార్టీ రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోంది. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు, పరారీలో ఆర్థిక నేరగాళ్ల నేపథ్యంలో రాహుల్‌గాంధీ చౌకీదార్‌ చోర్‌ హై (కాపాలదారుడే దొంగ) అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్‌ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తన పేరుకి ముందు చౌకీదార్‌ అని తగిలించుకోవడంతో అది వైరల్‌గా మారింది.

అంతే కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంలు, సోషల్‌ మీడియాలో మోదీ వీరభక్తులు తమ పేరు మందు చౌకీదార్‌ అని తగిలించుకోవడం మొదలు పెట్టారు. మైన్‌బీ చౌకీదార్‌ హ్యాష్‌ట్యాగ్‌  (నేను కూడా కాపలాదారుడినే) సోషల్‌ మీడియాలో ఇప్పుడు క్రేజ్‌గా మారింది. ఇలాంటి క్యాచీ హ్యాష్‌ట్యాగ్‌లే ఎన్నికల్లో ప్రభావితం కూడా చూపిస్తాయన్న అభిప్రాయం చాలా మందిలో నెలకొంది. తెలంగాణలో బీజేపీ సోషల్‌ వార్‌ రూమ్‌లో పనిచేస్తున్న లావణ్య శెట్టి ఎన్నికలంటే ఒక్కో కార్యకర్త ఒక్కో సైనికుడిలా పోరాడాలని అన్నారు.

‘సైనికుడంటే సరిహద్దుల్లో తుపాకులతో కాపలా కాయాల్సిన పని లేదు. మన దేశ దశ దిశను నిర్ణయించే ఎన్నికల్లో పనిచేయడం అంటే ఓ రకంగా యుద్ధం చేస్తున్నట్టే. ఇలాంటి సమయంలో పార్టీ విజ యం కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడే‘ అని వ్యాఖ్యానించారు.

సోషల్‌ సైన్యం..
భారతీయ జనతా పార్టీ 

  • రాష్ట్రాల విస్తీర్ణానికి అనుగుణంగా 20–30 మందితో ఐటీ సెల్‌
  • వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్‌ గ్రూప్స్, 
  • యూ ట్యూబ్, టెలిగ్రామ్‌లలో చురుగ్గా ప్రచారం. 
  • గ్రామీణ ప్రాంత ప్రజలతో అనుసంధానం పెరగడానికి హిందీతో పాటు ఇతర 15 ప్రాంతీయ భాషల్లో ఎన్నికల ప్రచారం
  • బీజేపీ సొంతంగా సృష్టించిన నమో యాప్‌తో దేశం నలుమూలలా ఉన్న వివిధ వర్గాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటామంతీ
  • పన్నా ప్రముఖ్‌ వ్యూహ రచనలో మునిగితేలిన ఆర్‌ఎస్‌ఎస్‌.. 
  • బూతు స్థాయిలో ప్రజలకు చేరువయ్యేందుకు వ్యూహాలు

కాంగ్రెస్‌ పార్టీ 

  • 15– 20 మంది వృత్తి నిపుణులు, పార్టీ కార్యకర్తలతో రాష్ట్రాల స్థాయిలో ఐటీ సెల్స్‌.. సోషల్‌ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రత్యేక సెల్స్‌ ఏర్పాటు 
  • ఘర్‌ ఘర్‌ కాంగ్రెస్‌ యాప్, శక్తి యాప్‌ ద్వారా ఎన్నికల ప్రచార నిర్వహణ.. వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్‌ గ్రూప్స్‌లో చురుగ్గా కార్యకర్తలు..
  • నెటిజన్లను ఆకర్షించే హ్యాష్‌ ట్యాగ్స్, గ్రాఫిక్స్, మీమ్స్‌ రూపొందించడానికి ప్రత్యేక సాంకేతిక బృందాలు 
  • కేంద్రం లోటుపాట్లను ఎత్తి చూపించడానికి ప్రత్యేక బృందాలు..

ఎన్నికలూ ఉద్యోగాలిస్తాయ్‌ ..
ఉద్యోగాల్లేవని యువత రోడ్డెక్కి నిరసనలు చేస్తూ ఎన్నికల్లో తమ పవర్‌ చూపించడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు అవే ఎన్నికలు చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సోషల్‌ మీడియాపై అవగాహన ఉండి, రాజకీయాలు లోతుగా అర్థం చేసుకోగలిగి, వీడియో ఎడిటింగ్‌లో నైపుణ్యం, కాస్తో కూస్తో సృజనాత్మకత ఉంటే చాలు ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్, షేర్‌చాట్, యూట్యూబ్, టిక్‌టాక్‌ వంటి సంస్థలు రా రమ్మంటూ ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఈ ఉద్యోగాలు ఏంటంటే

  • కంటెంట్‌ మేనేజర్స్‌
  • కంటెంట్‌ ఎడిటర్స్‌ 
  • సోషల్‌ మీడియా ఎక్స్‌పర్ట్స్‌
  • ఫ్యాక్ట్‌ చెకర్స్‌

వీళ్ల పనేంటంటే నిరంతరం ఆ యాప్‌లను పర్యవేక్షిస్తూ, అం దులో వస్తున్న అంశాల్ని గమనిస్తూ ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినా, తప్పుడు వార్తల్ని ప్రచారం చేసినా, ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా అవమానించేలా పోస్టులు, మీమ్స్‌ పెట్టినా వెంటనే సదరు యాజ మాన్యాల దృష్టికి తీసుకువెళ్లాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేలా ఫేస్‌బుక్‌ వ్యవహరించి ఆ దేశ కాంగ్రెస్‌ ముందు విచారణకు కూడా జుకర్‌బర్గ్‌ హాజరు కావడంతో ఈసారి ఎన్నికల్లో సోషల్‌ మీడియా దిగ్గజాలు ముందు జాగ్రత్త వహించాయి.

ఈ ఎన్నికల సీజన్‌లో వివిధ సంస్థలు 13 వేల ఉద్యోగాలు కల్పించాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ 15 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.  ఫేస్‌బుక్‌ 6,500 మంది సమీక్షకుల్ని నియమించినట్టు ప్రభుత్వానికి తెలిపింది. ఫేస్‌బుక్‌లో పోస్టులపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వెంటనే ఈ బృందాలు వాస్తవాలను పరి శీలించి సదరు అకౌంట్లను రద్దు చేస్తాయి. ఇక ఫ్యాక్ట్‌ చెకర్స్‌ ఉద్యోగాలకే ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువ. ఎందుకంటే సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఏది రియలో, ఏది వైరలో తెలుసుకోవడం కష్టంగా మారింది.

భారత దేశంలోని 15 భాషల్లో వచ్చే కంటెంట్‌ని జల్లెడ పట్టడం మామూలు విషయం కాదు. అందుకే వారికే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. భారత్‌ ఎన్నికల్లోనైనా తమ పరువు నిలుపుకోవడానికి ఫేస్‌బుక్‌ థర్డ్‌ పార్టీ ద్వారా 2 వేల మంది ఫ్యాక్ట్‌ చెకర్స్‌ని నియమించింది. గత ఏడాదితో పోలి స్తే ఈ ఏడాది కంటెంట్‌ మేనేజర్, కంటెంట్‌ ఎడిటర్‌ ఉద్యోగాలు 72% పెరిగాయని జాబ్‌ సెర్చ్‌ ఇంజన్‌ ఇండీడ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశికుమార్‌ వెల్లడించారు.  కంటెంట్‌ మేనేజర్స్‌కి జీతాలు కూడా బాగానే ఇస్తున్నారు.

ఏడాది అనుభవం ఉంటే చాలు  ఈ ఎన్నికల సీజన్‌లో నెలకి 30 వేల వరకు సంపాదించవచ్చు. అదే అయిదేళ్ల అనుభవం ఉంటే 50 వేల రూపాయల వరకు ఇస్తున్నట్టు సోషల్‌ మీడియా సంస్థల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థుల్ని పంపించే ఇన్ఫోసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహ వ్యవస్థాపకుడు అరవింద్‌ రావు చెప్పారు. ఇక అప్పుడే డిగ్రీ చేసిన వారికి కూడా కంప్యూటర్‌ పరిజ్ఞానంలో దిట్టలైతే చాలు వాళ్లకి ట్రైయినింగ్‌ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు  ఆయన వివరించారు. 

మొత్తం ఓటర్లు : 90 కోట్లు
ఇంటర్నెట్‌ వాడే ఓటర్లు :  50కోట్లు
18–19 ఏళ్ల వయసు వారు : 1.5కోట్లు
ఫేస్‌బుక్‌ వాడేవారు : 29.4 కోట్లు
వాట్సాప్‌ వాడేవారు  : 25 కోట్లు
ట్విటర్‌ వాడేవారు  : 3 కోట్లు 
ఇన్‌స్టాగ్రామ్‌ వాడేవారు : 6–8 కోట్లు

 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top