మరోసారి ప్రొటోకాల్‌ ఉల్లంఘించిన ఇమ్రాన్‌!

Imran Khan Diplomatic Blunder At Bishkek Netizens Cant Keep Calm - Sakshi

బిష్కెక్‌ : షాంఘై సహకార సదస్సుకు హాజరైన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సౌదీ రాజును అవమానించిన ఇమ్రాన్‌.. ఈ సదస్సులో మరోసారి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి వివిధ దేశాధినేతలను అగౌరవపరిచారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌లో గురువారం షాంఘై సహకార సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ దేశాధినేతలకు నిర్వాహకులు స్వాగతం పలుకుతున్న వీడియోను ఇమ్రాన్‌ పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్‌ తన అఫీషియల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ వ్యవహార శైలిపై సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. అతిథులను ఆహ్వానించే క్రమంలో కిర్గిజిస్తాన్‌ అధ్యక్షుడు ప్రపంచ దేశాధినేతలకు పేరుపేరునా స్వాగతం పలికారు. ఈ క్రమంలో.. సభాస్థలికి వచ్చే సమయంలో మిగిలిన నేతలంతా నిల్చునే ఉన్నప్పటికీ ఇమ్రాన్‌ ఒక్కరే తన సీట్లో కూర్చుండిపోయారు. తన పేరు పలికినపుడు మాత్రమే నిలబడి అభివాదం చేశారు. ఇమ్రాన్‌ చర్యపై మండిపడిన నెటిజన్లు.. కనీస మర్యాద కూడా పాటించరా అంటూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ‘ పాక్‌ ప్రధానికి ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. మిగతా వాళ్లంతా నిలబడి ఉండే మీరు మాత్రం కూర్చుంటారా. అందరూ వచ్చేదాకా ఆగలేరా. అంత అహంకారమా’ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇక మరికొందరు...‘ పాపం.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదేమో. కాసేపైనా కూర్చోకుండా ఉండలేరు కాబోలు. అర్థం చేసుకోరూ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఇటీవల సౌదీ ప్రభుత్వం మక్కాలో నిర్వహించిన అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) సమావేశానికి ఇమ్రాన్‌ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ రాజు వద్దకు వెళ్లి కరచాలనం చేసిన ఇమ్రాన్‌.. అనంతరం రాజు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా  ముందుకు కదిలారు. దీంతో ఇమ్రాన్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top