
ఇస్లామాబాద్: పాక్ న్యాయస్థానం నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌కు కోలుకోలేని దెబ్బ పడింది. దేశంలో గతంలో జరిగిన అల్లర్ల కేసుల్లో ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 2023, మే 9న పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దరిమిలా దేశంలోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాలపై పీటీఐ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలో పలువురు నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ అల్లర్ల కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) తాజాగా పీటీఐకి చెందిన ఏడుగురు సీనియర్ నేతలకు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలు శిక్ష పడిన నేతలలో సెనేటర్ ఎజాజ్ చౌదరి (పార్టీ సీనియర్ మహిళా నేత) సర్పరాజ్ చీమా (పంజాబ్ మాజీ గవర్నర్), డాక్టర్ యాస్మిన్ రషీద్ (పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి) , మెహమూదూర్ రషీద్ (మాజీ మంత్రి) న్యాయవాది అజీమ్ పహత్ (పార్టీ న్యాయ సలహాదారు) ఉన్నారు. మరో ఇద్దరు నేతలు కూడా శిక్ష పడినవారిలో ఉన్నారు. అయితే పలు మీడియా నివేదికలు ఐదుగురి పేర్లను హైలైట్ చేశాయి. ఈ కేసులో పీటీఐ వైస్ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
మరో కేసులో పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత మాలిక్ అహ్మద్ ఖాన్ భచర్, పీటీఐ పార్లమెంటేరియన్ అహ్మద్ చట్టా, మాజీ శాసనసభ్యుడు బిలాల్ ఎజాజ్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. నాడు జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్‌ఖాన్ 2023, ఆగస్టు నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పీటీఐ నేతలకు విధించిన శిక్షను ఫెడరల్ ప్రభుత్వం స్వాగతించింది. దీనిని సానుకూల చర్యగా అభివర్ణించింది. కాగా పీటీఐ పంజాబ్ చాప్టర్ హెడ్ అలియా హంజా, సీనియర్ నేత బాబర్ అవాన్, శాసనసభ్యుడు అసద్ కైసర్ ఈ శిక్షలను ఖండించారు. ఈ కేసులలో చట్టపరమైన విధానాలను అనుసరించలేదని, విశ్వసనీయ సాక్షులను హాజరుపరచలేదని వారు ఆరోపించారు.