ఆ దేశాలే బాధ్యులు

PM Narendra Modi calls for global efforts to eliminate terrorism - Sakshi

ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలపై ప్రధాని మోదీ

బిష్కెక్‌: షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆర్థిక సహాయం చేస్తున్న దేశాలను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని శుక్రవారం ఇక్కడ జరిగిన సదస్సులో మోదీ ఎస్‌సీవో నేతలకు స్పష్టం చేశారు.ఆహుతుల్లో ఉన్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్య చేశారు.ఉగ్రవాదాన్ని అరికట్టే విషయమై అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు.

ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంతో ఎస్‌సీవో ప్రదర్శిస్తున్న స్ఫూర్తిని మోదీ కొనియాడారు. ఉగ్రవాద రహిత సమాజం కావాలన్నదే భారత్‌ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు దేశాలన్నీ సంకుచితత్వాన్ని విడనాడి ఐక్యంగా ముందుకు రావాలన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు.‘గత ఆదివారం నేను శ్రీలంక వెళ్లినప్పుడు సెయింట్‌ ఆంథోనీ చర్చిని చూశాను.ఉగ్రవాదం వికృత ముఖం నాకక్కడ కనిపించింది’అని మోదీ అన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహని తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను తప్పకుండా జవాబుదారుల్ని చేయాలని మోదీ ఉద్ఘాటించారు. ఎస్‌సీవో ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక విధానం(ర్యాట్స్‌)కింద ఉగ్రవాదంపై పోరుకు సహకరించాలని ఆయన ఎస్‌సీవో నేతలను కోరారు.సాహిత్యం ,సంస్కృతి మన సమాజాలకు సానుకూల దృక్ఫధాన్ని అందించాయని, సమాజంలో యువత చెడుమార్గం పట్టకుండా ఇవి నిరోధించాయని మోదీ అన్నారు.  ఎస్‌సీవో సుస్థిరత, భద్రతలకు శాంతియుతమైన, ప్రగతిశీలమైన, భద్రతాయుతమైన ఆఫ్ఘనిస్తాన్‌ కీలకమని భారత ప్రధాని అన్నారు.

ఆప్ఘన్‌ శాంతి ప్రక్రియకు మద్దతివ్వడమే మన లక్ష్యమన్నారు. భారత దేశం ఎస్‌సివోలో సభ్యురాలై రెండేళ్లు అయిందని,ఈ రెండేళ్లలో ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో సానుకూల సహకారం అందించామని మోదీ అన్నారు. చైనా నాయకత్వంలో ఎనిమిది దేశాలతో ఎస్‌సీవో ఏర్పాటయింది.2017లో భారత, పాకిస్తాన్‌లకు దీనిలో సభ్యత్వం లభించింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్‌ మద్దతిస్తోందని భారత్‌ ఆరోపిస్తోంది.2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. పాక్‌ కేంద్రంగా గల ఉగ్రవాదులే ఈ దాడి చేశారని ఆరోపించిన భారత్, పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకుంది. మరోవైపు, బిష్కెక్‌ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు.

మోదీ–ఇమ్రాన్‌ పలకరింపులు
ఎస్‌సీవో సదస్సు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు దేశాధినేతలు ఉన్న లాంజ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలసుకున్నారు. భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి ఈ సందర్భంగా ఇమ్రాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు మోదీ ధన్యవాదాలు చెప్పారు. మోదీ–ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య ఎస్‌సీవో సదస్సు సందర్భంగా భేటీ ఉండదని విదేశాంగశాఖ గతంలోనే స్పష్టం చేసింది.  

దౌత్య మర్యాదకు ఇమ్రాన్‌ భంగం
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దౌత్య మర్యాదలను పాటించకుండా దేశాన్ని అపఖ్యాతి పాలు చేశారు.సదస్సు ప్రారంభ సమావేశానికి ఎస్‌సీవో అధినేతలందరూ వస్తుండగా అప్పటికే హాజరయిన దేశాధినేతలంతా మర్యాద పూర్వకంగా లేచి నిలబడితే ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం కూర్చునే ఉన్నారు.మోదీ సహా వివిధ దేశాధినేతలు నిలబడి ఉండగా, పాకిస్తాన్‌ ప్రధాని కూర్చుని ఉన్న వీడియో వైరల్‌ అయింది.ఇమ్రాన్‌ పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ అధికార ట్విట్టర్‌లో కూడా ఈ వీడియో వచ్చింది.సమావేశంలో నేతలందరినీ పరిచయం చేస్తున్నసమయంతో తన పేరు ప్రకటించగానే లేచి నిలబడిన ఇమ్రాన్‌ ఖాన్‌ వెంటనే కూర్చుండిపోయారు.ఇమ్రాన్‌ తీరుపై నెటిజన్లు రకరకాల వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top