
లాహోర్: పదవీచ్యుత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే వివిధ ఆరోపణలపై జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఖాన్ నిర్బంధాన్ని నిరసిస్తూ 2023 మే 9వ తేదీన పీటీఐ శ్రేణులు దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు డజను వరకు సైనిక కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు.
ఈ చర్యలపై ఫైసలాబాద్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు(ఏటీసీ) ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఫైసలాబాద్‌లోని ఐఎస్‌ఐ కార్యాలయ భవనంపై జరిగిన దాడికి సంబంధించి 108 మందికి, పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన 58 మందికి పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష పడిన వారిలో నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఒమర్ అయూబ్, సెనేట్‌లో ప్రతిపక్ష నేత షిబ్లి ఫరాజ్, కీలక నేతలు జర్తాజ్ గుల్, సాహిబ్‌జాదా హమీద్ రజా ఉన్నారు.
దోషులుగా ప్రకటించిన వారిలో ఆరుగురు నేషనల్ అసెంబ్లీ సభ్యులు కాగా ఒకరు పంజాబ్ అసెంబ్లీ సభ్యుడు, ఒక సెనేటర్ ఉన్నారు. ఇప్పటికే పీటీఐకి చెందిన 14 మందిని దోషులుగా ప్రకటిస్తూ మే 9వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొంది. తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని పీటీఐ తాత్కాలిక అధ్యక్షుడు గొహార్ అలీ చెప్పారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ‘ఫ్రీ ఇమ్రాన్ ఖాన్ మూవ్‌మెంట్’చేపట్టేందుకు పీటీఐ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.