గుక్కెడు నీటికి గంపెడు కష్టాలు

water problems in kondapi - Sakshi

మంచినీటికి చోడవరం గ్రామస్తులకు ఇక్కట్లు 

మరమ్మతులకు నోచుకోని చేతిపంపు

చుట్టుపక్కల గ్రామాల నుంచి మంచినీరు తెచ్చుకుంటున్న గ్రామస్తులు 

పట్టించుకోని అధికారులు 

సాక్షి, కొండపి(ప్రకాశం): మండలంలోని చోడవరం గ్రామస్తులకు రక్షిత మంచినీటి సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకులతో పాటు మూసి నుంచి ఓవర్‌హెడ్‌ ట్యాంకుకు మంచినీటి సరఫరాకు పైప్‌లైన్‌ ఉంది. దీంతో పాటు ఇటీవల రామతీర్థం రిజర్వాయర్‌ నుంచి  మంచినీరు గ్రామస్తులకు అందిస్తున్నామని అధికారులు పాలకులు చెబున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామస్తులకు గుక్కెడు మంచినీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో వెయ్యి మంది జనాభాతో పాటు మరో 500 మందికి పైగా కాలనీవాసులు ఉన్నారు. మంచినీరు అందించటం కోసం 50వేల లీటర్ల సామర్థ్యంతో గ్రామంలో ఒక ఓవర్‌హెడ్‌ ట్యాంకును నిర్మించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మూసిలో బోర్‌లు వేసి బావికి నీరు సరఫరా చేసి అక్కడి నుంచి గ్రామానికి మంచినీరు వచ్చేలా పథకం రూపొందించారు. దీంతో పాటు రామతీర్థం రిజర్వాయర్‌ నుంచి సైతం మంచినీరు గ్రామానికి మంచినీరు సరఫరా చేయటం కోసం పైప్‌లైన్‌  ట్యాంకుకు సైతం అనుసంధానం చేశారు. అంత వరకు బాగానే ఉన్నా రామతీర్థం రిజర్వాయర్‌ నుంచి ఒక్కరోజు సైతం గ్రామానికి మంచినీరు సరిగా సరఫరా చేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా అంతకు ముందు గ్రామంలోని రక్షిత పథకం నుంచి మంచినీరు అందడం లేదని గ్రామస్తులు తెలిపారు. అదే విధంగా గ్రామంలో 20 కుటుంబాలకు నీరు ఆధారంగా ఉన్న చేతిపంపు మరమ్మతులకు గురైనా ఇంత వరకు పట్టించుకోకపోవడంతో వాడుకనీరు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు.

అలంకారప్రాయంగా  ఓవర్‌హెడ్‌ట్యాంకు

పట్టించుకోని అధికారులు

గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పంచాయతీ కార్యదర్శి గానీ ప్రత్యేకాధికారి గానీ మంచినీరు సరఫరా విషయమై పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులకు పక్షం రోజులు పైగా మంచినీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రామతీర్థం నుంచి సరఫరా చేసే రక్షిత మంచినీరు పథకం పైపులైన్‌లో సమస్య ఉండి నీరు ట్యాంకుకు ఎక్కటం లేదని, పైప్‌లైన్‌ పగిలిందనే విషయం పథకం సిబ్బందికి తెలిపినా స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు.

పొరుగు గ్రామాలకు పరుగు..

గ్రామంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో పక్కన ఉన్న వెన్నూరు, దేవిరెడ్డిపాలెం గ్రామాలకు ద్విచక్రవాహనాలతో వెళ్లి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. వృద్ధులు పొరుగు గ్రామాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. కొంతమంది గ్రామానికి వచ్చే బబుల్‌వాటర్‌ వ్యాన్‌ల నుంచి మంచినీరు కొనుక్కోని తాగుతున్నట్లు తెలిపారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి కిరణ్‌ను ఫోన్‌లో వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని రామతీర్థం పైప్‌లైన్‌ పగిలిందని,  పైప్‌ జాయింట్‌ మిషన్‌తో వేయాలని అప్పటి లోగా గ్రామంలోని రక్షితపథకం నీరు అందిస్తాన్నారు. ప్రత్యేక అధికారి సురేఖను వివరణ కోరగా మంచినీరు సమస్య ఎవ్వరు తనదృష్టికి తీసుకరాలేదని, సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా అయినా తొలిస్తామని, ఎన్నికల పనుల్లో తీరికలేకున్నామని తెలిపారు.

పది రోజులుగా మంచినీరు సరఫరాలేదు

గ్రామానికి పక్షం రోజులుగా మంచినీరు సరఫరా లేదు. దీంతో గ్రామస్తులు మంచినీరు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవటంలేదు. రామతీర్థం మంచినీరు సైతం రావడం లేదు.
– ఆర్‌ వెంకటనారాయణ, చోడవరం

పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది

మంచినీరు కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. వయస్సు మళ్లిన వారు మంచినీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రెండు పథకాలు ఉన్నా మంచినీరు అందించలేకపోవటం దారుణం. మున్ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం కావడం లేదు.
– ఎన్‌ రమణయ్య, చోడవరం

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top