అభ్యున్నతి ఓ నాటకం!

మూడేళ్లుగా అమలు కాని 108 మార్జిన్‌ మనీ స్కీమ్‌ జీఓ

వయసు మెలికపెట్టి కాగితాలకే పరిమితం చేసిన సర్కార్‌

సొంత పెట్టుబడి లేక పరిశ్రమల ఏర్పాటుకు దూరమైన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు

షరతులు లేకుండా వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని డిక్కి డిమాండ్‌

ఒంగోలు టూటౌన్‌: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలకు రుణాలు అందని ద్రాక్షగా మారాయి. పరిశ్రమ ఏర్పాటుకు సొంత స్థలం ఉన్నప్పటికీ పెట్టుబడి (మార్జీన్‌మనీ)లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా అటు ఉద్యోగం రాక ఇటు ఎలాంటి వ్యాపారం చేయలేక జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016 డిసెంబర్‌లో మార్జిన్‌ మనీ స్కీంకు సంబంధించిన 108 జీఓ విడుదల చేసింది. అయితే వయస్సు మెలిక పెట్టి  (50 సంవత్సరాల వరకు ఈ మార్జీన్‌ మనీ స్కీమ్‌ అమలు చేయడాన్ని తేల్చకుండా) ఆ జీఓని ఇప్పటి వరకు కాగితాలకే పరిమితం చేశారు. ఒక వేళ అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులు, సొంత పెట్టుబడి లేని నిరుద్యోగులు ఎంతోమందికి వెసులుబాటు కలిగేది. పరిశ్రమలు పెట్టుకొని తమకాళ్లపై నిలబడగలిగే అవకాశం కలిగేది. అలాగే గ్రామాల్లో మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది. అయితే కేవలం లబ్ధిదారుని కాంట్రిబ్యూషన్‌ (సొంత పెట్టుబడి) లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకోలేపోతున్నారు.

ఒక్క శాతం కూడా ఖర్చు కాక..
ఏటా బడ్జెట్‌లో ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కేటాయిస్తున్న నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక శాతం కూడా ఖర్చు కాని పరిస్థితి నెలకొంది. ఒక్క ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులను ప్రోత్సహించేందకే 2015–16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఒక శాతం కూడా ఉపయోగించుకోలేకపోవడంతో మరుసటి ఏడాది రూ.270 కోట్లకు కుదించింది. అప్పటికీ మార్జిన్‌ మనీ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో రూ.270 కోట్ల నిధులు దాదాపు 90 శాతం నిధులు మిగిలిపోయినట్లు చైతన్య ఆక్వా ఇండస్ట్రీస్‌ అధినేత ఎం. చైతన్య ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఏడాది ఆ నిధులను రూ.170 కోట్లకు కుదించారు. ఇప్పటికీ మార్జిన్‌మనీకి సంబంధించిన జీఓని ఇచ్చి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కేటాయించిన రాయితీలను సద్వినియోగం చేసుకునే అవకాశం కనిపించడంలేదు. వాస్తవంగా 2015–20 పారిశ్రామిక విధానం మంచిదైనప్పటికీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు రాయితీలను అందిపుచ్చులేకపోతున్నారు. బ్యాంకుల సహకారం లేకపోవడం, సొంతపెట్టుబడి పెట్టే స్థోమత లేకపోవడం వంటి కారణాలతో ఎన్ని రాయితీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.

ఇప్పటి వరకు జిల్లాలో కొద్దోగొప్పో ఆర్థిక స్థోమత, పలుకుబడి ఉన్న ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు కేవలం రూ.6.29 కోట్ల రాయితీలను మాత్రమే ఉపయోగించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే 108 జీఓకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి ఉంటే కొత్తగా పరిశ్రమలు పెట్టుకునే ఔత్సాహికులు మరో రూ.50 కోట్ల వరకు రాయితీలను జిల్లాలో పొంది ఉండేవారు. ప్రస్తుతం 108 జీఓ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ వద్ద ఉందని డిక్కీ జిల్లా కో–ఆర్డినేటర్‌ వి. భక్తవత్సలం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా మార్గదర్శకాలు విడుదల చేసి, ఈఏడాది కేటాయించిన రాయితీలైనా సద్వినియోగం చేసుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వయసుతో నిమిత్తం లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top